కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. సాధారణ పౌరుల నుంచి దేశాధినేతల వరకు ఈ వైరస్ ఎవరిని విడిచిపెట్టడం లేదు. తాజాగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణికి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడుతున్న కీలక నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరి ఇప్పటివరకు ఎంత మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది?
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తొలినాళ్లలోనే వైరస్ బారిన పడ్డారు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్. మార్చి 27న కరోనా పాజిటివ్‌గా తేలిన క్రమంలో హోం క్వారంటైన్‌కు వెళ్లారు. ఆరోగ్యం క్షిణించగా ఏప్రిల్ 6న ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందారు. అనంతరం వారం రోజుల్లోనే కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
బ్రిటన్ ఆరోగ్యా శాఖ మంత్రి..
బోరిస్ జాన్సన్‌కు వైరస్ పాజిటివ్‌గా తేలిన రెండు గంటల్లోనే తానూ కరోనా బారిన పడినట్లు ప్రకటించారు బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హాన్కాక్. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలిపారు.
యూకే ప్రిన్స్ చార్లెస్..
యునైటెడ్ కింగ్డమ్ రాజు చార్లెస్‌కు మార్చి 25న కరోనా పాజిటివ్‌గా తేలింది. హోం ఐసోలేషన్‌కు వెళ్లిన ఆయన ఐదు రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకుని మార్చి 30న బయటకు వచ్చారు. వైరస్ నుంచి బయటపడ్డప్పటికి భౌతిక దూరం వంటి నియమాలు పాటిస్తున్నట్లు వెల్లడించారు.
బ్రెజిల్ అధ్యక్షుడు..
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారొకు జులై 7న కరోనా వైరస్ సోకింది. అంతకు ముందు కొవిడ్-19ను చిన్న ఫ్లూగా పేర్కొన్నారు బొల్సొనారొ.
రష్యా ప్రధానమంత్రి..
రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్‌కు ఏప్రిల్ 30న పాజిటివ్‌గా తేలింది. అనంతరం ఆయన విధులను ఉపప్రధాని ఆండ్రూ బెలుసోవ్ నిర్వర్తించారు. అయితే.. కీలక సమావేశాలకు హాజరయ్యేవారు ప్రధాని.
రష్యా మంత్రి..
రష్యా నిర్మాణ, గృహ, యుటిలిటీస్ శాఖ మంత్రి వ్లాదిమిర్ యాకుషేవ్, ఆయన డిప్యూటీ దిమిత్రి వోల్కోవ్కు కొవిడ్-19 సోకింది.
ఇరాన్లో.
ఇరాన్ ఉపాధ్యక్షురాలు, అధ్యక్షుడు హస్సాన్ రోహిణి మహిళా వ్యవహారాల డిప్యూటీ అయిన మసౌమెహ్ ఎబ్టెకర్కు ఫిబ్రవరి 27న కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం ఆమె క్వారంటైన్లోకి వెళ్లారు.
ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఇరాజ్ హరిర్చి ఫిబ్రవరి 25న కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ఆ దేశ మీడియా నివేదించింది.