తెలంగాణ

telangana

ETV Bharat / international

చిక్కుల్లో 'టెడ్డీ'

చుట్టూ మంచు. అందులో తెల్లటి ఎలుగు బంటి. ఆర్కిటిక్​ ప్రాంతంలో కనిపించే ఈ దృశ్యం ఊహించుకుంటూనే ఎంతో ఆహ్లాదంగా ఉంది కదూ. కానీ... ఇప్పుడు ధ్రువపు ఎలుగుబంట్ల మనుగడకు ప్రమాదం ఏర్పడింది. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సమాఖ్య... వీటిని అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చింది.

ధ్రువపు ఎలుగుబంటి

By

Published : Mar 1, 2019, 9:06 PM IST

ధ్రువపు ఎలుగుబంటి

ధ్రువపు ఎలుగుబంటి.. అత్యంత శీతల ప్రాంతాల్లో నివసించే అరుదైన క్షీరదం. భూతాపంతో ధ్రువాల్లో క్రమంగా మంచు కరిగిపోతుండటం వీటి మనుగడ కష్టమవుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు పర్యావరణ సంరక్షకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

"ప్రస్తుతం ప్రకృతి ఆవాసాల్లో 25,000 ధ్రువపు ఎలుగుబంట్లు ఉన్నట్లు అంచనా. మాకు తెలుసు అదేమంత పెద్ద సంఖ్య కాదు. ఇప్పుడు వాటికి మరింత గడ్డుకాలం రాబోతుంది.

మానవుడు రోజురోజుకు సుదూర ప్రాంతాలకు విస్తరిస్తున్నాడు. ప్రస్తుతం ఇది ఆర్కిటిక్​ వరకు చేరుకుంది. పర్యటకం, సైనిక స్థావరాలు, చమురు వెలికితీత వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ అతిపెద్ద మాంసాహారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. "
- ఫ్లోరిన్ సిక్స్, ధ్రువపు ఎలుగుబంటి సంరక్షకుడు

బెర్లిన్​లోని టయర్​ జూ పార్క్​ వీలైనంత వరకూ వీటిని రక్షించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇక్కడ టాంజా అనే ఎలుగుబంటి ఉంది. గత డిసెంబర్​లోనే మరో ఎలుగుబంటికి జన్మనిచ్చింది టాంజా. ఇదే తరహాలో బెర్లిన్​లోనే మరో జూలో నట్​ అనే ఎలుగును సంరక్షిస్తున్నారు.

సాధారణ ఆవాసాల్లో జీవించే ఎలుగుబంట్లకు వీటికి తేడా ఉంటుందని భావిస్తున్నారు విశ్లేషకులు. వాటి ఆవాసాల్లో ఉన్నప్పుడు అత్యధిక కొవ్వు పదార్ధాలుండే సీల్​ను ఆహారంగా తీసుకుంటాయి.

"సాధారణ ఆవాసాల్లో ఐదు నుంచి పదిరోజులకు ఒక సీల్​ను వేటాడి తింటాయి. అదే జరగకపోతే అవి తమ బరువును కోల్పోతాయి. ఈ పరిస్థితులు వాటి ఆరోగ్య క్షీణతకు దారితీస్తాయి. ఫలితంగా పునరుత్పత్తిపై ప్రభావం పడుతుంది."
-జార్జ్​ డర్నర్, అమెరికా భూపరిశోధన విభాగం సర్వేయర్

అమెరికాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలస్కాలో 1990 నుంచి ధ్రువపు ఎలుగుబంట్ల జనాభాలో 40 శాతం క్షీణత ఉంది. రోజురోజుకీ బరువు తగ్గిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యాలో ఇటీవల జనావాసాల్లోకి సుమారు 50 ధ్రువపు ఎలుగుబంట్లు చొరబడటం అక్కడి పరిస్థితిని తెలియచెబుతోంది.

ఈ పరిస్థితిని అదుపులోకి తేవాలని ధ్రువపు ఎలుగుబంట్లు నివసించే ఐదు ఆర్కిటిక్ దేశాలు ఆలోచిస్తున్నాయి. 2017 జనవరిలో అమెరికా 'పోలార్ బేర్​ రికవరీ ప్లాన్'​ ప్రారంభించింది. ఈ చర్యలు ఎంతమేరకు ఫలిస్తాయో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details