టీవీల్లో ప్రసారమయ్యే వంట కార్యక్రమాలు చూసే చిన్నారులు.. చూడని పిల్లల కన్నా మూడురెట్లు అధికంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకుంటున్నారని నెదర్లాండ్స్ 'టిల్బర్గ్ విశ్వవిద్యాలయం' నివేదించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పబ్లికేషన్ 'జర్నల్ ఆఫ్ న్యూట్రీషియన్ ఎడ్యుకేషన్ అండ్ బిహేవియర్'లో ఈ విషయంపై కథనం ప్రచురితమైంది.
10 నిమిషాల పాటు..
డచ్ పబ్లిక్ టెలివిజన్‌లో పిల్లల కోసం రూపొందించిన వంట కార్యక్రమాన్ని 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు చిన్నారులకు రోజుకు 10 నిమిషాలు చూపించారు పరిశోధకులు. పిల్లలు వంట కార్యక్రమం చూసినందుకు వారికి చిరుతిళ్లను అందించారు. అయితే ఇతరుల కన్నా వంట షోలు చూసిన వారు తమ ముందున్న చిరుతిళ్లలో ఆరోగ్యకరమైనవి ఎంపిక చేసుకున్నారు. చూసిన వారు ఆపిల్, లేదా దోసకాయ ముక్కలు తీసుకుంటే.. చూడని వారు చిప్స్, జంక్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపారు.
"ఈ పరిశోధనలో కనుగొన్న విషయాలు పిల్లల ఆహార ప్రాధాన్యతలు, ప్రవర్తనలో సానుకూల మార్పులకు దోహదపడుతుందని ఆశిస్తున్నా. పాఠశాలల్లో పోషక విద్యను అందించడం వల్ల పిల్లల వైఖరి మారుతుంది. ఏదైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పాఠశాలలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. పాఠశాలలకు విద్యార్థులు, సిబ్బందితో పాటు విస్తృతమైన బాహ్య ప్రపంచం అనుంబంధంగా ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థులను ఆ విధంగా ప్రోత్సహించాలి"