కొవిడ్-19 సోకి ఆస్పత్రిలో చేరిన సమయంలో.. దురదృష్టవశాత్తూ తాను మరణిస్తే ఆ వార్తను బయటి ప్రపంచానికి చెప్పేందుకు వైద్యులు ముందే సిద్ధమైనట్లు వెల్లడించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.
కరోనా వైరస్ బారినపడి ఏప్రిల్ 5న లండన్లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో చేరిన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఏప్రిల్ 12న తిరిగొచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రిలో కష్టంగా గడిచిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు బోరిస్. దాదాపు మరణం అంచుల వరకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. 'ది సన్'కి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నా పరిస్థితిలో పురోగతి లేనందున..
''వైద్యులు లీటర్ల కొద్దీ ఆక్సిజన్ ఖర్చుచేస్తున్నారు. అయినా, ఎలాంటి పురోగతి కనిపించకపోయే సరికి.. పరిస్థితులు చేదాటిపోతే ఆ విషయాన్ని ఎలా బయటకు చెప్పాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అది నాకు అర్థమవుతూనే ఉంది. అవన్నీ చేదు జ్ఞాపకాలు'' అంటూ గద్గద స్వరం, చెమర్చిన కళ్లతో బోరిస్ నాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు.
వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞుణ్ని..
''కొన్ని రోజుల్లోనే నా ఆరోగ్యం అంతలా ఎలా క్షీణించిందో అంతుబట్టలేదు. అంతా చికాకుగా అనిపించింది. ఎందుకు కోలుకోలేకపోతున్నానో నాకే అర్థం కాలేదు. ఇక నా వాయునాళంలో ప్రత్యేక ట్యూబ్ అమర్చుదామా.. అనే వరకు వెళ్లింది. ఇక అప్పుడు పరిస్థితి చేదాటిపోతే ఎలా అని వైద్యుల ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను ఉద్వేగానికి లోనవుతున్నాను. కానీ, అలాంటి పరిస్థితుల నుంచి కూడా నన్ను తిరిగి మామూలువాణ్ని చేసిన ఘనత వైద్యులకే దక్కుతుంది. ఆస్పత్రిలో నాపై తీసుకున్న శ్రద్ధ మాటల్లో చెప్పలేనిది. అద్భుతంగా పనిచేసిన వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుణ్ని'' అంటూ వైద్యులు చేసిన సేవల్ని కొనియాడారు.