ఇటలీకి చెందిన ఇద్దరు సౌండ్ ఇంజినీర్లు వైన్ నుంచి సంగీతాన్ని స్వరపరుస్తున్నారు. నాణ్యమైన మద్యం గొప్ప సంగీతాన్ని వినిపిస్తుందని వైన్ నుంచి మ్యూజిక్‌ను స్వరపరిచిన వాద్యకారుడు ఫిలిప్పో కోసెంటినో తెలిపారు. ఇటలీలో జనాదరణ పొందిన బరోలో రెడ్ వైన్ నుంచి వినసొంపైన సంగీతాన్ని.. తాము సృష్టించినట్లు ఆయన చెప్పారు.
రెండు ధర్మాల ఆధారంగా..
ద్రవాల కదలిక ధర్మం ఆధారంగా.. వాటి నుంచి శబ్దాలను సృష్టించినట్లు వివరించారు. సృష్టిలో ఒక్కో ద్రవానికి ఒక్కో కదలిక ధర్మం ఉంటుంది. వాటిలో ఏదైనా అలజడి సృష్టిస్తే శబ్ద ధర్మమూ ఉంటుంది. వైన్‌కు కూడా ఆ రెండు ధర్మాలు ఉంటాయని.. ఈ ఇద్దరు సౌండ్ ఇంజనీర్లు నిరూపించారు. వైన్ శబ్దాలను సంగీతమయం చేశారు.
ఇటలీలో లభించే దాదాపు అన్ని వైన్స్‌కు.... అవి చేసే శబ్దాలను స్వర పరిచినట్లు ఫిలిప్పో తెలిపారు. వీటిని మొదట కంప్యూటర్‌లో రికార్డు చేసి వాటి ద్వారా శబ్దాలు స్వరపరిచినట్లు పేర్కొన్నారు. గ్లాసులో మద్యం పోసినప్పుడు బుస్సుమనే శబ్దం చేస్తూ గాలిబుడగలు పైకి వస్తుంటాయి. ఆ సమయంలో.. ఆ ద్రవంలో చేతి వేలితో కదలికలు చేసినప్పుడు తక్కువ పౌనఃపున్యం కలిగిన శబ్దాలు ఉత్పన్నమవుతాయి. అలా వెలువడిన శబ్దాలనే స్వరాలుగా మార్చారు ఈ సరికొత్త స్వరకర్తలు.
ఈ ప్రయోగం వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది మద్యం ఉత్పత్తి దారులు తమను సంప్రదిస్తున్నట్లు ఫిలిప్పో తెలిపారు. తమ మద్యం బ్రాండ్లు చేసే సంగీతాన్ని రికార్డు చేయాలని వారు కోరుతున్నారని ఆయన వివరించారు.
ఇదీ చూడండి:సైన్యం కోసం సరికొత్త 'సమాచార' ఆవిష్కరణ