కరోనా విజృంభణ- ఇటలీలో 30 లక్షల కేసులు - italy corona cases
ఇటలీలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. వరుసగా మూడో రోజూ 20వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ దేశంలో కొవిడ్ బాధితుల సంఖ్య 30 లక్షలు దాటింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 4 లక్షలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.
ఇటలీలో 30లక్షల కొవిడ్ కేసులు.. ప్రపంచవ్యాప్తంగా మరో 4లక్షలు
By
Published : Mar 6, 2021, 11:10 AM IST
మరో 24 వేల 36 కొత్త వైరస్ కేసులతో ఇటలీలో బాధితుల సంఖ్య 30 లక్షల 23 వేల 129కు చేరింది. మహమ్మారి తొలినాళ్లలో విరివిగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు జరపనందున వాస్తవంగా కేసుల సంఖ్య ఇంకా ఎక్కువేనని అంచనా. శుక్రవారం మరో 297 మరణాలతో వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 99 వేల 271కు చేరింది. తమ దేశానికి అత్యవసరంగా టీకాలు అందాల్సిన అవసరం ఉందని ఇటలీ వైద్యారోగ్య శాఖ అధికారి గియానీ రెజా అన్నారు.
ఒక్కరోజే 4 లక్షలు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 4లక్షల 47వేల 51 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 11 కోట్ల 66 లక్షల 60వేల 186కు చేరింది. మరో 9,655 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 25లక్షల 91వేల 302కు ఎగబాకింది. ప్రస్తుతానికి 2 కోట్ల 17 లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. 9కోట్ల 22లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ఈ దేశాల్లో పరిస్థితి ఇలా..
అమెరికాలో కొత్తగా 67వేల 281పాజిటివ్ కేసులు బయటపడగా.. మొత్తం కేసులు 2కోట్ల 95లక్షల 93వేలకు పెరిగాయి. తాజాగా మరో 1,794 మంది కరోనా రోగులు మరణించారు.
యూకేలో కొత్తగా 5 వేల 947 కొత్త కేసులు నమోదుకాగా.. 236 మంది మత్యువాతపడ్డారు.
బ్రెజిల్లో 75 వేల 337 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 1760 మంది కరోనా బాధితులు మరణించారు.