చైనా తర్వాత ఇటలీ.. విజృంభిస్తున్న కరోనా చైనా వెలుపల అత్యధిక కొవిడ్-19 (కరోనా) వైరస్ మరణాలు సంభవించిన దేశంగా ఇటలీ నిలిచింది. మొన్నటి వరకు 133గా ఉన్న మరణాల సంఖ్య ఒకేసారి అనూహ్యంగా 366కు చేరింది. కేసుల సంఖ్య 1,492 నుంచి 7,375కు పెరిగింది.
ఈ గణాంకాలతో కేసుల సంఖ్యలో దక్షిణ కొరియాను దాటి ఇటలీ రెండో స్థానానికి ఎగబాకింది. దక్షిణ కొరియాలో ప్రస్తుతం 7,313 కరోనా కేసులు నమోదయ్యాయి.
అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇటలీ పౌర రక్షణ ఏజెన్సీ 2.2 కోట్ల మాస్కుల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.
ప్రఖ్యాత వెనీస్ నగరం, వాణిజ్య రాజధాని మిలాన్‌కు రాకపోకలను నిషేధించింది ప్రభుత్వం. ఎవరినీ ఈ ప్రాంతాలు విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 1.5 కోట్ల మంది వారి నగరాల్లోనే ఉన్నారు.
ప్రసిద్ధ ప్రదర్శనశాలలు, కట్టడాల సందర్శనను ప్రభుత్వం నిషేధించింది. దేశంలో ఎక్కడికక్కడ కఠినమైన ఆంక్షలు విధించింది.