కరోనా వ్యాప్తి నివారణకు ఇటలీ ప్రధానమంత్రి గియుసేప్ కోంటే కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఉత్తర ఇటలీని ఏప్రిల్ 3 వరకు నిర్బంధంలో ఉంచుతూ డిక్రీ జారీ చేశారు. ఫలితంగా లాంబార్డీ సహా పక్కనున్న 15 రాష్ట్రంలోని కోటీ 60 లక్షల మంది ప్రజలు ప్రభావితం కానున్నారు.
అన్నీ బంద్!
ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ప్రచురించిన డిక్రీ ప్రకారం... దేశంలోని మ్యూజియంలు, థియేటర్లు, ఇతర వినోద వేదికలు, పాఠశాలలు, నైట్ క్లబ్లు, కాసినోలను మూసివేస్తారు. అయితే వృత్తి పరమైన అత్యవసరాలు, అసాధారణ సందర్భాలు, ఆరోగ్య సమస్యలకు మాత్రం మినహాయింపులు ఉంటాయి.
చైనా తరువాత ఇటలీనే
చైనా తరువాత కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఇటలీలోనే ఎక్కువ. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి 233 మంది మరణించారు. ఫిబ్రవరి 1న దేశ ఉత్తర భాగంలో ప్రారంభమైన ఈ వైరస్ వ్యాప్తి ఇంకా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,247 మందికి కొత్తగా కరోనా సోకింది. దీనితో ఆ దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5,883కి చేరుకుంది.
చైనా బాటలో
కరోనాతో అతలాకుతలమైన చైనా... ఈ మహమ్మారి వైరస్ను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకుంది. ప్రజల ప్రయాణాలపై నియంత్రణలు విధించింది. బహిరంగ కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఫలితంగా చాలా వరకు ఈ అంటువ్యాధిని నియంత్రించగలిగింది. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు కూడా ఇదే సూత్రాన్ని అవలంబిస్తున్నాయి.
చివురుటాకులా ప్రపంచం
ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 3,400కి చేరింది. శనివారం నాటికి ఆసియాలో 90,000, ఐరోపాలో 8,000, పశ్చిమాసియాలో 6,000, కరేబియన్ దీవులతో కలిపి ఉత్తర, లాటిన్ అమెరికాల్లో 450, ఆఫ్రికాలో 50 కరోనా కేసులు నమోదయ్యాయి.
భయపడొద్దు
చాలా మంది శాస్త్రవేత్తలు ఈ కరోనా వ్యాప్తిని 'ప్రపంచ వ్యాధి'గా గుర్తించాలని అభ్యర్థిస్తున్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అందుకు ససేమిరా అంటోంది. అలా చేస్తే ప్రజలు మరింత భయందోళనలకు గురయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. ఏటా సీజనల్గా వచ్చే వ్యాధుల కంటే ఈ కరోనా సృష్టించిన మారణహోమం తక్కువేనని చెబుతోంది.
ఇదీ చూడండి:ట్రంప్ సభకు హాజరైన వ్యక్తికి కరోనా