సాంకేతికత, మానవమేధస్సు కలబోతతో వైద్య రంగంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నారు నిపుణులు. త్రీడీ సాంకేతికత ఉపయోగించి 24 గంటల వ్యవధిలోనే ముఖానికి సర్జరీలు పూర్తి చేస్తున్నారు. ప్రమాదంలో విరిగిపోయిన ముఖం ఎముకలను తక్కువ సమయంలోనే సాధారణ స్థితి తీసుకొస్తున్నారు. ముందుగా కంప్యూటర్ ద్వారా ముఖం ఆకృతిని తయారు చేసి.. ఆ తర్వాత టైటానియం ప్లేట్ల సాయంతో విరిగిన భాగాలను సరిగ్గా అమర్చుతున్నారు.
ఓ 23 ఏళ్ల యువకుడికి ఇదే తరహాలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు ఇటలీ వైద్యులు. ప్రమాదంలో అతని ముఖం ఎముకలు విరిగిపోయాయి. చికిత్స కోసం అతన్ని టూరిన్లోని సీటీఓ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం కంప్యూటర్ స్క్రీన్‌పై మీరు చూస్తోన్న పుర్రె నమూనా అతనికి సంబంధించిందే. ఆ నమూనే విరిగిన అతని ముఖం ఎముకల్ని అతికించడానికి సాయం చేసింది.
"విరిగిన ఎముకల్ని ఈ కంప్యూటర్ తెరపై అతికించాము. యువకుడి ముఖం నమూనాకు అనుగుణంగా సరైన చిత్రాన్ని తయారుచేశాం. దాన్ని ప్రింట్ తీశాం. ఈ త్రీడీ నమూనాకు కొన్ని పరికరాల సాయంతో విరిగిన భాగాల్ని అతికించాలి. శస్త్రచికిత్స చేసేటప్పుడు ఈ పథకాన్నే అమలు చేయాలన్నది మా ఉద్దేశం."
-ఇమ్మాన్యుయెల్ జావట్టేరో, సర్జన్, సీటీవో ఆసుపత్రి
సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రాత్రికి రాత్రే పూర్తి చేస్తారు వైద్యులు. అయితే ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి వీరికి ఆండ్రియా నోవరేసియో అనే ఇంజనీర్ సహాయం అందించాడు.
"ఈ 2డీ పుర్రె చిత్రాన్ని త్రీడీకి మార్చడమే మా పని. ఈ పుర్రె త్రీడీ నమూనాని వైద్యుడు పరిశీలిస్తాడు. ఆ తరువాత పుర్రెలోని ఏ ఎముకలు విరిగాయో గుర్తిస్తాడు. కీలు భాగాల్ని సరైన చోట కుదిర్చి అంతిమ మోడల్‌ను సిద్ధం చేస్తాం. ఇక్కడ పసుపు రంగులో కనిపించే భాగం చూడండి. దవడల్ని సరిగ్గా బిగించి పూర్వ స్థితికి తీసుకురావడాన్ని చూడొచ్చు. గతంలో ఆపరేషన్ చేసేటప్పుడే మోడల్‌ను తయారుచేసి రోగికి అమర్చేవారు. ఇప్పుడు త్రీడీ సాయంతో ముందుగా మోడల్‌ను తయారు చేసుకుంటున్నాం. దీని వల్ల సమయం ఆదా అవుతోంది. అంతేకాక సర్జరీని విజయవంతంగా పూర్తిచేయవచ్చు."