ISS CRASH RUSSIA: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా.. పాశ్చాత్య దేశాల నుంచి కఠిన ఆంక్షలు ఎదుర్కొంటోంది. అవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) మీద కూడా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఐరోపా దేశాలు తీసుకుంటున్న చర్యలతో ఐఎస్‌ఎస్ కూలిపోయే ప్రమాదం ఉందని రోస్ కాస్మోస్(రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ) మరోసారి హెచ్చరించింది. వెంటనే ఈ కఠిన ఆంక్షలు ఎత్తివేయాలని సంస్థ డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్ పిలుపునిచ్చారు. వాటివల్ల ఐఎస్‌ఎస్‌కు రష్యా వైపునుంచి అందుతున్న సేవలకు అంతరాయం కలగనుందని వెల్లడించారు. ఫలితంగా 500 టన్నుల బరువైన ఈ నిర్మాణం సముద్రంలో కానీ, భూమిపై కానీ కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత రోగోజిన్ ఇదివరకే ఈ తరహా బెదిరింపులకు పాల్పడ్డారు.
ఐఎస్‌ఎస్ నిర్దేశిత కక్ష్యలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపెల్షన్ సిస్టమ్‌ను అందజేస్తోంది రష్యానే. ఐఎస్‌ఎస్‌లో ముఖ్యంగా రెండు కీలకమైన విభాగాలున్నాయి. ఇందులో ఒకదాన్ని అమెరికా పర్యవేక్షిస్తుంటే.. మరొకదాన్ని రష్యా నిర్వహిస్తోంది. ఐఎస్‌ఎస్‌ను నివాసయోగ్యంగా మార్చే పవర్ సిస్టమ్స్‌లను యూఎస్ నిర్వహిస్తోంది. ఇక ఈ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్యలో తిరిగే బాధ్యతలను రష్యా చూస్తోంది.