వాతావరణ సంక్షోభానికి పరిష్కారాలు కనుగొనే లక్ష్యంతో ఒకే వేదికపైకి చేరిన ప్రపంచ దేశాలు.. అందుకు గల కార్యాచరణను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా సంపన్న దేశాలు ఎలాంటి హామీలు ఇస్తున్నాయనే విషయంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమయ్యింది. ఇలాంటి కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden news) మాత్రం కునుకు(Biden Asleep) తీస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కాప్26 ఐరాస సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 120దేశాధినేతలు, అధ్యక్షులు పాల్గొన్నారు. ఒక్కో దేశం తాము చేపడుతోన్న కార్యక్రమాలు, చేయాల్సిన విషయాలపై అంతర్జాతీయ సమాజానికి వివరిస్తున్నాయి. ఈ సమయంలో ఆయా దేశాల ప్రతినిధుల ప్రసంగాలను వింటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మెల్లగా కునుకు(Biden Asleep) తీస్తున్నట్లు ఉన్న ఓ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. దాదాపు 20 సెకన్లపాటు అలా నిద్రలోకి జారుకున్నట్లు అందులో కనిపించింది. కొద్దిసేపటికి ఓ సహాయకుడు బైడెన్ దగ్గరికి వచ్చి పలుకరించగా తేరుకున్న ఆయన(Biden Asleep).. తిరిగి ప్రసంగాన్ని వినడం ప్రారంభించారు. అమెరికా వార్తాపత్రికకు చెందిన ఓ జర్నలిస్టు ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయడంతో తాజాగా అది వైరల్‌గా మారింది. షేర్ చేసిన కొన్ని గంటలకే 46లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు.