ప్రపంచ అవినీతి సూచీలో భారత్ 86వ స్థానంలో నిలిచింది. అవినీతి సూచీ-2020 పేరుతో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్(టీఐ) విడుదల చేసిన నివేదికలో 2019 కంటే భారత్ 6 స్థానాలు దిగజారింది. 2019లో 80వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 86వ ర్యాంకులో నిలిచింది.
ప్రపంచంలోని 180 దేశాల్లో అవినీతి స్థాయి గురించి ఏటా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఓ నివేదికను రూపొందిస్తుంది. ఏ దేశంలో అవినీతి ఎక్కువగా ఉందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వచ్చిన స్కోర్ ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది. ఈ స్కోరు సున్నా నుంచి 100 వరకు ఉంటుంది. సున్నా సాధించిన దేశంలో అవినీతి అత్యధికంగా ఉందని అర్థం. ఈ విభాగంలో భారత్ స్కోర్ 40గా ఉంది. గతేడాదితో పోలిస్తే స్కోర్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఆరు స్థానాలు దిగజారింది.