భారత్‌లో కరోనా రెండోదశ కొనసాగుతున్న వేళ ప్రపంచదేశాలు అండగా నిలుస్తున్నాయి. తాజాగా అదనపు అత్యవసర వైద్య పరికరాలు సరఫరా చేయనున్నట్లు ఐరోపా సమాఖ్య(ఈయూ) ప్రకటించింది. స్పెయిన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాలు సైతం భారత్‌కు సాయం చేయడానికి ముందుకొచ్చాయి.
దీనిలో భాగంగా స్పెయిన్.. 119 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 145 వెంటిలేటర్లు సరఫరా చేయనుండగా.. డెన్మార్క్ 53 వెంటిలేటర్లు పంపుతోంది. నెదర్లాండ్స్ 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 30 వేల యాంటీవైరల్ ఔషధాలు, రెమ్డెసివిర్తో పాటు.. 449 వెంటిలేటర్లు భారత్‌కు అందిస్తున్నట్లు ఈయూ తెలిపింది. అలాగే 15 వేల యాంటీవైరస్ డ్రగ్స్‌తో పాటు 516 వెంటిలేటర్లను జర్మనీ.. భారత్‌కు పంపిస్తున్నట్లు పేర్కొంది.
ఈ విపత్కర సమయంలో మిత్ర దేశమైన భారత్‌కు సాయం చేస్తున్నందుకు తాము గర్వపడుతున్నట్లు ఈయూ తెలిపింది. కరోనాతో పోరులో విజయం సాధించాలంటే సమష్టి కృషి అవసరమని పేర్కొంది.