తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత యువత భవిష్యత్తు భద్రం - యువజన అభివృద్ధి సూచీలో భారత్​ స్థానం

యువజన అభివృద్ధి అత్యంత వేగంగా జరిగిన ఐదు దేశాల్లో భారత్​ రెండో స్థానంలో నిలిచింది. లండన్​లోని ఓ సంస్థ విడుదల చేసిన 2020 ప్రపంచ యువజనుల అభివృద్ధి సూచీలో ఈ విషయం స్పష్టమైంది. ఇదిలా ఉంటే 181 దేశాల్లో యువత స్థితిగతులను అధ్యయనం చేసి రూపొందించిన జాబితాలో మాత్రం భారత్​ 122వ స్థానానికి పరిమితమైంది.

Youth Development Index
యువజన అభివృద్ధి సూచీ

By

Published : Aug 11, 2021, 7:49 AM IST

భారత్​లో యువత కీలకమైన విద్య, ఉపాధి రంగాల్లో శరవేగంగా పురోగతి సాధిస్తున్నారు. తద్వారా దేశ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. లండన్​లోని కామన్​వెల్త్​ సచివాలయం విడుదల చేసిన 2020 ప్రపంచ యవజనుల అభివృద్ధి సూచీతో ఈ విషయం ప్రస్ఫుటమైంది. దీని ప్రకారం 2010-2018 మధ్య యువజన అభివృద్ధి అత్యంత వేగంగా జరిగిన ఐదు దేశాల్లో భారత్​ రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో అఫ్గానిస్థాన్​, మూడు నాలుగు స్థానాల్లో రష్యా, ఇథియోపియా, బుర్కినా ఫసో నిలిచాయి. ఈ దేశాలు యువజన అభివృద్ధిలో సగటున 15.74 శాతం పురోగతిని సాధించాయి. కానీ మొత్తంగా చూస్తే భారత్​ భాగా వెనుకబడి ఉంది.

విద్య, ఉపాధి, ఆరోగ్యం, సమానత్వం, శాంతి, భద్రత, రాజకీయ, పౌర కార్యకలాపాలు తదితర 27 అంశాల్లో యువత పాత్ర, అభివృద్ధిపై 181 దేశాల్లో సర్వే నిర్వహించిన ప్రపంచ యువత అభివృద్ధి సూచీ(గ్లోబల్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌)లో భారత్‌ 122వ స్థానంలో నిలిచింది. సింగపూర్‌ మొదటి స్థానంలో నిలవగా.. స్లోవేనియా, నార్వే, మాల్టా, డెన్మార్క్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చాద్‌, ది సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, దక్షిణ సుడాన్‌, అఫ్గానిస్థాన్‌ జాబితాలో అడుగున ఉన్నాయి.

3.1 శాతం మెరుగుదల

2010 నుంచి 2018 వరకు ప్రపంచవ్యాప్తంగా 15- 29 ఏళ్ల మధ్యవారిపై అధ్యయనం చేసి, నివేదిక విడుదల చేసిందీ ఈ సంస్థ. ఈ వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా యువత పరిస్థితులు 3.1 శాతం మెరుగుపడ్డాయని వెల్లడించింది. కానీ పురోగతి నెమ్మదిగా ఉన్నట్లు తెలిపింది. కొవిడ్‌ వ్యాప్తికి ముందు సేకరించిన వివరాలు అయినా.. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు సాధించిన ప్రగతి కూడా నీరుగారే అవకాశం ఉందని, వెంటనే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. ర్యాంకింగ్స్‌ విడుదలకు ముందు 'ది కామన్‌వెల్త్‌' ప్రధాన కార్యదర్శి పాట్రిసియా స్కాట్లాండ్‌ మాట్లాడుతూ.. ఉజ్వల భవిష్యత్తు అందించడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు.

రాజకీయాలపై నిరాసక్తత..

ఆయా అంశాలవారీగా చూసుకుంటే.. విద్యలో స్వీడన్‌, సమానత్వంలో లక్జెంబర్గ్‌, రాజకీయ, పౌర చైతన్యంలో ఇండోనేషియా, ఉపాధి, ఆరోగ్యం, శాంతి, భద్రత అంశాల్లో సింగపూర్‌ ముందంజలో ఉన్నాయి. గత ఫలితాలతో పోల్చితే అఫ్గానిస్థాన్‌, భారత్‌, రష్యా, ఇథియోపియా, బుర్కినా ఫాసో దేశాలు మెరుగుదల కనబర్చిన మొదటి ఐదు దేశాల్లో నిలిచాయి. యువతలో మరణాల రేటు, హెచ్‌ఐవీ కేసుల సంఖ్య, మద్యపానం, పొగాకు బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కానీ.. మహిళల భద్రత విషయంలో పురోగతి కనిపించలేదని నివేదికలో వెల్లడైంది. 102 దేశాల్లోని యువత.. రాజకీయాలపై తక్కువ ఆసక్తి కనబర్చుతున్నట్లు తేలింది.

ఇదీ చూడండి:నేర చరిత్ర వివరాలేవి? భాజపా, కాంగ్రెస్​కు జరిమానా!

ABOUT THE AUTHOR

...view details