2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi Cop26 Speech) పేర్కొన్నారు. వాతావరణ మార్పులు కట్టడి చేసేందుకు పారిస్ ఒప్పందంలోని తీర్మానాలకు అనుగుణంగా కార్యచరణ చేపట్టిన ఏకైక దేశం భారత్(Paris Accord india) అని చెప్పారు. వాతావరణ మార్పుల కట్టడి కోసం భారత్ ఎంతో శ్రమిస్తోందని.. దాని ఫలితాలు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు గ్లాస్గో వేదికగా జరిగిన కాప్26 'ప్రపంచ నేతల సదస్సు'లో(COP26 Summit) ఆయన(Modi Cop26 Speech) మాట్లాడారు.
"పారిస్ ఒప్పందంలో తీర్మానాలకు అనుగుణంగా కార్యచరణ చేపట్టిన పెద్ద ఆర్థిక వ్యవస్థ గల ఏకైక దేశం భారత్ అని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. వాతావరణ మార్పుల కట్టడి కోసం అన్ని ప్రయత్నాలను దృఢ నిశ్చయంతో చేస్తున్నాం. మేం దీనికోసం ఎంతో శ్రమిస్తున్నాం. దీని ఫలితాలను త్వరలోనే చూపిస్తాం."
-ప్రధాని మోదీ.
భారత్ తన విధానాలలో వాతావరణ మార్పులను కేంద్ర స్థానంలో ఉంచుతోందని మోదీ(Modi Climate Change Policy) తెలిపారు. రాబోయే తరానికి ఈ సమస్యలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల సిలబస్‌లో వాతావరణ అనుకూల విధానాలను చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వాతావరణ మార్పుల కోసం ఐదు లక్ష్యాలను భారత్ నిర్దేశించుకుందని మోదీ ఈ సదస్సులో(Modi Cop26 Speech) తెలిపారు. తద్వారా వాతావరణ మార్పుల కట్టడిలో భారత్ అద్భుత ఫలితాలు సాధిస్తుందని చెప్పారు.
"శిలాజేతర ఇంధన వినియోగాన్ని 2030 నాటికి 500 గిగా వాట్లకు భారత్ పెంచుతుంది. 2030నాటికి భారత్ తన ఇంధన అవసరాలలో 50శాతాన్ని పునరుత్పాదక వనరుల నుంచి పొందుతుంది. ఇప్పటి నుంచి 2030నాటికి భారత్ తన కర్బన ఉద్గారాలను 100 కోట్ల టన్నుల మేర తగ్గిస్తుంది. భారత్ తన ఆర్థిక వ్యవస్థలో కర్బన ఉద్గారాల కోసం ఖర్చు చేస్తున్న ఖర్చును 45శాతం మేర తగ్గిస్తుంది. 2070నాటికి కర్బన ఉద్గార రహితంగా(నెట్ జీరో) భారత్ అవతరిస్తుంది. ఈ ఐదు చర్యలు.. వాతావరణ మార్పుల కట్టడిలో అద్భుత పాత్ర పోషిస్తాయి."
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
కాలుష్య నివారణకు సంఘటిత పోరాటమే పరిష్కారమని మోదీ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి ధ్యేయం కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతితోనే మానవుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని... వాతావరణ మార్పులు మన జీవన విధానంపై మార్పులు చూపుతాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పుల కట్టడి కోసం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.
మోదీ-జాన్సన్ భేటీ
కాప్26 సదస్సు వేదిక వద్ద మోదీ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భేటీ అయ్యారు. హరిత హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనాలు, శుద్ధ పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగం వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ ఏడాది మే నెలలో రెండు దేశాల నేతలు నిర్వహించిన వర్చువల్ శిఖరాగ్ర సదస్సులో ఈ అంశంపై అవగాహన కుదిరిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి నిధుల సమీకరణ (క్లైమేట్ ఫైనాన్స్), పునరుత్పాదక ఇంధనాలు, అంతర్జాతీయ సౌర సంకీర్ణం (ఐఎస్‌ఏ), విపత్తులను తట్టుకొనే మౌలిక వసతుల సంకీర్ణం (సీడీఆర్‌ఐ) వంటి సంయుక్త కార్యక్రమాలపై బ్రిటన్‌తో కలిసి పనిచేస్తామని మోదీ చెప్పారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా జాన్సన్‌ను మోదీ ఆహ్వానించారు. ఈ ఇద్దరు నేతల మధ్య ప్రత్యక్ష భేటీ జరగడం ఇదే మొదటిసారి.
ఇండియా గ్రీన్ గ్యారంటీ
భారత్‌లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 75 కోట్ల పౌండ్లను సమకూర్చుకునేందుకు బ్రిటన్ 'ఇండియా గ్రీన్ గ్యారంటీ'ని ఇస్తుంది. దీనివల్ల శుద్ధ ఇంధనం, రవాణా, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో పర్యావరణ అనుకూల, దృఢ మౌలిక వసతులకు నిధులు లభిస్తాయి. దీనికితోడు ప్రైవేటు మౌలిక వసతుల అభివృద్ధి బృందం (పీఐడీజీ) ద్వారా వర్ధమాన దేశాల్లో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు 21 కోట్ల డాలర్ల పెట్టుబడులకూ బ్రిటన్ సమ్మతించింది. దీనికింద భారత్‌లో విద్యుత్ వాహనాల ప్రాజెక్టులకూ నిధులు అందుతాయి.
ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
ఐరాస వాతావరణ సదస్సు ‘కాప్26’లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్ నుంచి సోమవారం ఉదయం గ్లాస్గో చేరుకున్నారు. గ్లాస్గోలో స్కాట్లాండ్ బ్యాగ్‌పైపర్లు బాణీలను ఆలపిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో భారత సంతతి ప్రజలు ఆయనను చూసేందుకు వచ్చారు. 'భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. గ్లాస్గో, ఎడిన్‌బరోకు చెందిన భారత సంతతి ప్రతినిధులు మోదీతో భేటీ అయ్యారు. వీరిలో ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ తన శిలా ప్రతిమను ఆవిష్కరించారు. హకీం అనే ప్రవాస భారతీయ వైద్యుడు దీన్ని ప్రధానికి బహుకరించారు. ఈ విగ్రహానికి పెట్టడం కోసం ప్రధాని తన కళ్లద్దాలను ఇచ్చారు. బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియమ్ నిర్వహించిన 'ఎర్త్ షార్ట్ ప్రైజ్' విజేత, దిల్లీకి చెందిన రీసైక్లింగ్ సంస్థ టకాచార్ వ్యవస్థాపకుడు విద్యుత్ మోహన్, సౌర శక్తితో నడిచే ఇస్త్రీ బండిని రూపొందించిన 14 ఏళ్ల తమిళనాడు బాలిక వినిషా ఉమాశంకర్‌లను కలుసుకున్నారు.
ఇవీ చూడండి:
'ప్రకృతితో మమేకమై జీవించటాన్ని భావితరాలకు నేర్పించాలి'
COP26 Summit: జేమ్స్‌బాండ్ కథతో ప్రపంచ దేశాలకు ప్రధాని వార్నింగ్