Ban Of Biological Weapons: సామూహిక విధ్వంసానికి దారి తీసే జీవాయుధాలను ఎవరూ ఏ రూపంలోనూ వినియోగించరాన్న వైఖరిని భారత్ మరోమారు స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితిలో శుక్రవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జీవాయుధ యుద్ధంగా మారకుండా.. తక్షణమే జీవరసాయన, జీవాయుధ నిషేధ ఒప్పందం (బీసీడబ్ల్యూసీ) తేవాలని నొక్కి చెప్పింది.
ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చిన భారత్.. సమస్యను ఇరుపక్షాలు చర్చలతోనే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. రష్యా, ఉక్రెయిన్లు శత్రుత్వాలను వదిలి చర్చలు సాగిస్తేనే ఈ ప్రాంతంలో శాంతికి బాటలు పడతాయని ఐరాసలో భారత శాశ్వత రాయబారి ఆర్. రవీంద్ర అన్నారు. ఇరు దేశాల మధ్య తాజాగా మరోమారు దౌత్య చర్చలు మొదలవడాన్ని ఆయన స్వాగతించారు.