Russia Resolution on Ukraine: ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా ప్రవేశ పెట్టిన తీర్మానం వీగిపోయింది. ఈ తీర్మానంపై ఓటింగ్‌కి మొత్తం సభ్యదేశాల్లో భారత్ సహా మరో 12 దేశాలు దూరంగా ఉన్నాయి. రష్యా ప్రవేశపెట్టిన తీర్మానానికి చైనా మాత్రమే మద్దతు తెలిపింది. ఆమోదానికి అవసరమైన 9 ఓట్లు రాకపోవడంతో తీర్మానం వీగిపోయింది. తాను చేస్తున్న దాడులపై ప్రస్తావించకుండానే ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభంపై రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. అనుకూలంగా ఓటు వేయాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ ప్రజల సురక్షిత తరలింపునకు వీలుగా మానవతా సాయన్ని సులభతరం చేయాలని కోరింది. భారత్‌తో పాటు మరో 12 సభ్యదేశాలు ఈ తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ చేస్తోందనే 13 సభ్య దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయని అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ అన్నారు. తాను సృష్టించిన మానవతా సంక్షోభాన్ని పరిష్కరించమని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతూ రష్యా తీర్మానం ఇవ్వడం అన్యాయమన్నారు. అటు రష్యా తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్న భారత్.. గతంలో మాస్కోకు వ్యతిరేకంగా ఇతర దేశాలు తీర్మానాలు ఇచ్చినా ఇదే వైఖరిని అవలంబించింది.
Russia Ukraine War: మాస్కోలోని అమెరికా ఎంబసీ నుంచి అనేక మంది అమెరికా దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. ఈ మేరకు తాము ఇచ్చిన జాబితా అమెరికా ఎంబసీకి చేరిందని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి.. రష్యా మిషన్‌కు చెందిన 12మంది దౌత్యవేత్తలను అమెరికా ఈనెల ఆరంభంలో బహిష్కరించింది. వారంతా గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతూ అమెరికాలో తమ నివాస హక్కులను దుర్వినియోగం చేసినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను శత్రువు చర్యగా అభివర్ణించిన రష్యా, అగ్రరాజ్యం నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంది. తాజాగా మాస్కోలోని అమెరికా దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో, ఇరు దేశాలు పరస్పరం ఆంక్షలు విధించుకున్నాయి. అటు రష్యా తాజా చర్యలను తప్పుపట్టిన అమెరికా.. ఇది ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. వెంటనే తమ దౌత్యవేత్తలపై విధించిన బహిష్కరణలను ఎత్తివేయాలని రష్యాను కోరింది.