2002లో ఫ్రాన్స్‌లో సంచలనంగా మారిన ఎలోడి కులిక్ అనే యువతి అత్యాచారం, హత్యకు గురైన కేసుకు సంబంధించి.. ఉత్తర ఫ్రాన్స్‌లోని ఆమిన్స్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. విల్లీ బార్డాన్ను దోషిగా తేల్చి 30 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. న్యాయస్థానం శుక్రవారం ఈ తీర్పునిచ్చిన క్షణాల్లోనే నిందితుడు పురుగుల తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు కోమాలోకి వెళ్లాడు. తిరిగి శనివారం స్పృహలోకి వచ్చాడు. అయితే విల్లీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం అతడు పోలీసుల సంరక్షణలో చికిత్స పొందుతున్నాడు.
అసలేం జరిగింది?
2002 జనవరిలో 24 ఏళ్ల ఎలోడి కులిక్ను అపహరించి.. ఉత్తర ఫ్రాన్స్ ఇస్నేలోని టెర్ట్రీ ప్రాంతానికి తీసుకెళ్లారు ఇద్దరు వ్యక్తులు. అత్యాచారం చేసి.. ఆమెను చంపేశారు. మృతదేహాన్ని కాల్చేశారు. అత్యాచారం సమయంలో ఎలోడి అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేసింది. ఆమె ఫోన్ కాల్ 26 సెకన్ల పాటు రికార్డయింది. ఈ సమాచారమే.. కేసును ఛేదించడంలో కీలకంగా మారింది.
ఇది విల్లీ బార్డాన్, గ్రెగోరి వియార్ట్ల పనేనని డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు పోలీసులు. ఎలోడి తండ్రి జాకీ కులిక్ పోరాటఫలితంగా కేసు విచారణ దాదాపు 17 ఏళ్లు సాగింది. ఉత్తర ఫ్రాన్స్‌లోని ఆమిన్స్ కోర్టు... పూర్వాపరాలను పరిశీలించి ఇద్దరినీ దోషులుగా తేల్చింది. 30 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. తీర్పు వెలువరించిన సెకండ్ల వ్యవధిలోనే బార్డాన్ 'టెమిక్' అనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అది అత్యంత ప్రమాదకర రసాయనం అయినందున నాడీవ్యవస్థ, గుండెపై ప్రభావం చూపింది. బార్డాన్ చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. కాగా 2003లోనే మరో దోషి.. గ్రెగోరి వియార్ట్ చనిపోయాడు.
"సుధీర్ఘ విచారణ తర్వాత తుది తీర్పును కోర్టు వెలువరించింది. తీర్పు వచ్చిన కొన్ని సెకండ్లలోనే బార్డాన్ ఆత్మహత్యకు యత్నించాడు. కోర్టు ఆవరణలోకి పురుగుల మందు ఎలా తెచ్చాడన్నది ఎవరికీ అంతుపట్టలేదు."
-ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ డీబోస్చేర్
తీర్పుపై ఎలోడి తండ్రి జాకీ కులిక్ స్పందిస్తూ..' కోర్టు తీర్పు నా మనసును తేలిక చేసింది. నా బిడ్డకు న్యాయం జరిగింది. ఈ విషయాన్ని నా కూతురు సమాధికి చెబుతా' అన్నారు.