ప్రాణాంతక మహమ్మారి కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సమాఖ్య రంగంలోకి దిగింది. వివిధ దేశాల్లోని జాతీయ సంస్థలతో సమన్వయంతో పనిచేస్తోంది. అధిక రిస్క్ ఉన్న దేశాల్లో పరిస్థితిని పర్యవేక్షించి సలహాలు ఇవ్వడం సహా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్(ఐఎఫ్ఆర్సీ) స్పష్టం చేసింది.
అప్పటి నుంచీ సేవలు
వైరస్ ప్రభావం తీవ్రమైనప్పటి నుంచి రెడ్‌క్రాస్ వైద్య, విపత్తు స్పందన విభాగాలకు చెందిన నిపుణులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉన్నట్లు ఐఎఫ్ఆర్సీ వెల్లడించింది. 192 దేశాల్లోని మానవతా సేవకులు ఆయా దేశాల్లోని ప్రజలకు సహాయసహకారాలు అందిస్తున్నట్లు పేర్కొంది. వైరస్ సంక్షోభం ముగిసే వరకు వీరందరూ తమ సేవలు కొనసాగిస్తారని స్పష్టం చేసింది.
రెడ్‌క్రాస్, రెడ్ క్రిసెంట్‌కు చెందిన 1.4 కోట్ల మంది వలంటీర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.65 లక్షల స్థానిక విభాగాలు సేవలు అందిస్తున్నట్లు ఐఎఫ్ఆర్సీ వెల్లడించింది. ప్రతి స్వచ్ఛంద సేవకుడు స్థానిక యంత్రాంగంతో సంబంధాలు నెలకొల్పడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారని పేర్కొంది. ప్రస్తుతం కోరలు చాస్తున్న వైరస్‌ను కట్టడి చేయడానికి ఈ నిబద్ధత కీలకంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించింది.
నిధుల సమీకరణ!
కొవిడ్-19తో పోరాటానికి అంతర్జాతీయ రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ మూమెంట్-ఐఎఫ్ఆర్సీ, ఐసీఆర్సీ, జాతీయ రెడ్‌క్రాస్ రెడ్ క్రిసెంట్ సొసైటీలు ప్రాంతీయ స్థాయిలో నిధుల కోసం విజ్ఞప్తి చేస్తున్నాయి. వైద్య సదుపాయాలు, పరికరాల సరఫరా, స్థానిక వలంటీర్ల సమీకరణ, కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించడం సహా మహమ్మారి సామాజిక, ఆర్థిక ప్రభావాలను తగ్గించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు రెడ్‌క్రాస్ స్పష్టం చేసింది.
ఇంక్యుబేషన్‌కు ముందే వ్యాపించింది
వైరస్ ఇంక్యుబేషన్ సమయం రోజుల నుంచి వారాల పాటు ఉంటుందని, కానీ సాధారణ సమయాల్లో వ్యాధి లక్షణాలు బయటపడక ముందే విదేశీ ప్రయాణాలు కూడా జరిగినట్లు అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సమాఖ్య వెల్లడించింది. దీంతో దూరంతో సంబంధం లేకుండా ఒక దేశంలో ఉద్భవించిన వైరస్ ఇతర దేశాలకు సులువుగా వ్యాపించిందని స్పష్టం చేసింది. తొలి కేసు నమోదైన మూడు నెలల్లోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా విస్తరించిందని ఈ సందర్భంగా ఉదహరించింది.
కొవిడ్ ఉగ్రస్వరూపం
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పటివరకు 12.13 లక్షల కేసులు నమోదయ్యాయి. 65 వేలకు పైగా మంది మరణించారు. మరోవైపు కరోనా ప్రభావానికి ప్రపంచంలో ఒక్కసారిగా వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 77 వేల వెంటిలేటర్ల డిమాండ్ మాత్రమే ఉండగా.. ఇప్పుడా డిమాండ్ లెక్కకుమించుతోంది. కొవిడ్ సంక్షోభం వల్ల ఒక్క న్యూయార్క్ నగరంలోనే 30 వేల అదనపు వెంటిలేటర్లు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు..
ఇదీ చదవండి:కరోనా కరాళ నృత్యం.. 65 వేలు దాటిన మరణాలు