టెక్నాలజీ ప్రపంచానికి గుండెకాయ ఎక్కడుందంటే సెమీకండక్టర్ చిప్‌లో ఉందని చెబుతారు. అది కొంత నిజం కావచ్చు. కానీ, ఆ చిప్‌లు తయారు కావడానికి అవసరమైన యంత్రాన్ని తయారు చేసే ఓ కంపెనీ టీఎస్‌ఎంసీ, ఇంటెల్, శామ్‌సంగ్ వంటి సంస్థలను శాసించగలదు. అత్యంత పలుచటి సిలికాన్ పొరలపై అల్ట్రావైలెట్ కిరణాల సాయంతో నానోమీటర్లంత సర్క్యూట్లను ముద్రించాలి. దీనికి అవసరమైన యంత్రం చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆ యంత్రాల సరఫరా ఆగిపోతే సెమీకండక్టర్ పరిశ్రమ కుప్పకూలిపోతుంది. ప్రపంచంలో అటువంటి యంత్రాలను విక్రయించే కంపెనీల్లో మూడు కంపెనీలు మార్కెట్ వాటా 90శాతానికి పైగా ఉంది. అవే ఏఎస్‌ఎంఎల్, కెనాన్, నికాన్. వీటిల్లో కూడా డచ్‌కు చెందిన ఏఎస్‌ఎంల్ కంపెనీ ప్రపంచ మార్కెట్లో 62శాతం వాటాను దక్కించుకొంది.
ఆర్థిక కష్టాలను తట్టుకొని..
అప్పుడప్పుడే కంప్యూటర్ వినియోగం మొదలైన సమయంలో ఏఎస్‌ఎంఎల్‌ను ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం ఫిలిప్స్, ఏఎస్‌ఎం ఇంటర్నేషనల్ అనే సెమీకండక్టర్స్ తయారీ సంస్థ భాగస్వాములు. తొలుత ఈ కంపెనీ కోసం ఫిలిప్స్ ఫ్యాక్టరీ ఆవరణలోనే కొంత స్థలం కేటాయించారు. ఈ కంపెనీ తొలుత తయారు చేసిన పరికరాలను కొనుగోలు చేసే వినియోగదారులు లేరు. దీంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఫిలిప్స్ కంపెనీ ఆర్థికంగా అండగా ఉండటం.. డచ్ ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడంతో మెల్లగా నిలదొక్కుకొంది. 1995లో ఈ కంపెనీ న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డామ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టైంది. అప్పట్లో చిప్ పరిమాణం చాలా పెద్దదిగా ఉండేది. భవిష్యత్తులో వీటి పరిమాణం గణనీయంగా తగ్గిపోతుందని ఈ సంస్థ అంచనావేసింది. దీంతో చిప్‌లపై కంటికి కనిపించనంత చిన్న సర్క్యూట్లను ముద్రించేలా 'ఎక్స్‌ట్రీం అల్ట్రావైలెట్ లిథోగ్రఫీ' (ఈయూవీ) దృష్టిపెట్టింది. 2007 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంది. ఇటువంటి కాంతిపై ప్రయోగాలు చేయడం కష్టతరం కావడంతో అనుకున్న సమయం కంటే ఎక్కువ సేపు పట్టింది. 2006లో తొలి పరికరాన్ని బెల్జియంలోని ఐఎంఈసీ అనే ప్రయోగశాలకు అందజేసింది. ఆ తర్వాత ఈ టెక్నాలజీ వైపు కంపెనీలు మొగ్గు చూపలేదు. డీప్‌అల్ట్రా వైలెట్ లిథోగ్రఫీ(డీయూవీ) వైపు మొగ్గు చూపారు.
కష్టం ఫలించి..
అవసరాలకు తగినట్లు అత్యంత చిన్న చిప్స్ వినియోగం ఇటీవల పెరిగిపోయింది. దీంతో డీయూవీ టెక్నాలజీతో చిన్న చిప్‌సెట్లపై సర్క్యూట్స్ ముద్రించడం సాధ్యంకాదు. డీయూవీ టెక్నాలజీతో 248 నానోమీటర్ల లేదా 193 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో చిప్స్‌ను తయారు చేస్తోంది. అదే ఈయూవీ టెక్నాలజీ 13.5 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో పనిచేస్తుంది. సరళంగా చెప్పాలంటే ఓ గోడపై పెయింట్ వేయడానికి వెడల్పైన బ్రష్ వాడతాము.. అదే పుస్తకంపై రాయడానికి పెన్ వాడతాము. అలానే చిప్ సైజ్ తగ్గిపోయేకొద్దీ సంక్లిష్టమైన అతిసూక్ష్మ సర్క్యూట్లను ముద్రించడానికి ఈయూవీ టెక్నాలజీని వాడతారు. 2018 నుంచి ఏఎస్‌ఎంల్ తయారు చేసిన ఈయూవీ యంత్రాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించడం మొదలుపెట్టడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ యంత్రం బరువు సుమారు 180 టన్నులు ఉంటుంది. దీనిలో లక్షకుపైగా విడిభాగాలు ఉంటాయి. ఒక షిప్‌లో దీనిని తరలించాలంటే 40 కంటైనర్లు అవసరం.