అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులు(Afghan crisis) పొరుగు దేశాలకు సవాలుగా మారకూడదని భారత్ పేర్కొంది. లష్కర్-ఏ-తొయిబా, జైష్-ఏ-మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు అఫ్గానిస్థాన్ తన భూభాగంలో ఆశ్రయం ఇవ్వకూడదని ఉద్ఘాటించింది. అన్ని జాతుల ప్రాతినిధ్యంతో కూడిన సమ్మిళిత, విస్తృత పరిపాలన అక్కడ అంకురించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. అఫ్గాన్ సంక్షోభం నేపథ్యంలో జెనీవాలోని ఐరాస మానవహక్కుల మండలి(UNHRC) ప్రత్యేకంగా సమావేశమైంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రామణి పాండే చర్చలో మంగళవారం పాల్గొన్నారు.
"అఫ్గానిస్థాన్‌లో తీవ్ర మానవతా సంక్షోభం తలెత్తింది. అక్కడి పౌరుల ప్రాథమిక హక్కులు, హింసాత్మక ఘటనల పట్ల సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆ దేశ పరిస్థితులు త్వరలోనే సర్దుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ప్రాంతీయ శాంతి, భద్రతలు ఆ దేశ స్థిరత్వంతో ముడిపడి ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లతో లష్కర్-ఏ-తొయిబా, జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాదులకు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జమ్ముకశ్మీర్ భద్రత విషయమై ఆందోళనలు నెలకొన్నాయి. అఫ్గాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. అక్కడ శాంతి భద్రతలను పరిరక్షించాలని, అఫ్గాన్ పౌరులతో పాటు ఐరాస సిబ్బంది, విదేశీ రాయబారులు, దౌత్య సిబ్బందికి భద్రత కల్పించాలని.. మానవ హక్కులను పరిరక్షించాలని సంబంధిత వర్గాలను పదే పదే కోరుతున్నాం"
-ఇంద్రామణి పాండే, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి