భారత్‌లో కరోనా వ్యాప్తిపై కీలక విషయాలు వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)(Who India Covid News). కరోనా బారిన పడుతున్న వారిలో 19 ఏళ్ల లోపు వయసు వారు, మహిళలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. వారిలో మరణాలు రేటు కూడా అధికంగా ఉన్నట్లు చెప్పింది. కరోనా ఇతర వేరియంట్లతో పోల్చితే.. డెల్టా వేరియంట్(delta variant in india) కారణంగా.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ బారిన పడుతున్న కేసులు వెలుగుచూస్తున్నట్లు పేర్కొంది. కొవిడ్-19 వారపు నివేదికలో డబ్ల్యూహెచ్ఓ(Who India Covid News) ఈ విషయాలు వెల్లడించింది.
"భారత్‌లో 9,500 మంది కొవిడ్ బాధితుల జన్యుక్రమం ఆధారంగా చేసిన అధ్యయనంలో 19 ఏళ్ల లోపు వారు , మహిళలు ఎక్కువగా కరోనా బారినపపడుతున్నట్లు తేలింది. మరణాల రేటు, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. కరోనా బి.1 వేరియంట్‌తో పోల్చినప్పుడు.. డెల్టా వేరియంట్ కారణంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ బాధితులుగా మారుతున్న సందర్భాలు తరుచూ వెలుగు చూస్తున్నాయి."
-ప్రపంచ ఆరోగ్య సంస్థ
నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..?
- ఆగస్టు నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి.
- సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 మధ్య 31 లక్షల కొత్త కొవిడ్ కేసులు, 54,000 కరోనా మరణాలు మాత్రమే నమోదయ్యాయి.
- ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 23.4కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 48 లక్షలుగా ఉంది.
- గతవారంతో పోలిస్తే కొత్త కేసులు ఈ వారంలో 9శాతం తగ్గాయి. మరణాల సంఖ్య మాత్రం స్థిరంగా ఉంది.
- ఐరోపా ప్రాంతం మినహా అన్ని ప్రాంతాల్లో వారంవారీ కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గింది.
- ఆఫ్రికాలో(43శాతం) అత్యధికంగా వారంవారీ కరోనా కేసులు తగ్గాయి.
- కరోనా వారంవారీ మరణాలు.. అమెరికా, ఐరోపా మినహా అన్ని ప్రాంతాల్లో 10శాతం కంటే పైగా తగ్గాయి.