ఇటలీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆవాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటలీలోని మధ్య ఉత్తర ప్రాంతమైన ఎమిలీయా రోమగ్నాలో వరద ప్రభావం అధికంగా ఉంది. మూడు రోజులుగా కురుస్తున్న వానలకు మోడెనా ప్రాంతంలోని పనారో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక మేయర్ తెలిపారు. ఎమిలీయాలో 48 గంటలుగా ఏకధాటిగా పడుతున్న భారీ వర్షాలను.. గత మూడేళ్లలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు.
వెనిస్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. అక్కడి ప్రధాన ప్రాంతాలు వర్షపు నీటితో దర్శమిస్తున్నాయి. రోడ్లపై నిలిచిన నీటితో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెనిస్‌లోని సిటీ హాల్ ప్రాంతంలో వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తూ 1.38 మీటర్ల ఎత్తు మేర నీరు నిలిచింది. రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు చర్యలను చేపడుతున్నట్లు.. వెనిస్ నగర మేయర్ తెలిపారు.