సెప్టెంబర్‌లో జరగబోయే జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులు ప్రత్యేక ప్రచారం చేపట్టారు. దీనికి తాజాగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ మద్దతు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో భారత్‌లో జాతీయ స్థాయి పరీక్ష నిర్వహించడం అన్యాయమన్నారు. అంతేకాకుండా దేశంలో లక్షలాది మంది వరదల కారణంగా ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నట్లు గ్రెటా థన్‌బర్గ్ ట్విటర్‌లో వెల్లడించారు.
'వాయిదా వేయాలి'
ఇక దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని ఇప్పటికే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. భాజపా సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
'వాయిదా కుదరదు'
అయితే.. దేశవ్యాప్తంగా నీట్, జేఈఈ-మెయిన్‌లను వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లోనే వాటిని నిర్వహించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని విచారణ సమయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కోర్టుకు తెలిపింది. 'విద్యార్థుల భవిష్యత్‌ను ఎక్కువకాలం ప్రమాదంలో ఉంచలేం' అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు సెప్టెంబర్‌లో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి-'మహా' భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 10