స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్... తనకు కరోనా వైరస్ సోకిందేమోనన్న అనుమానం వ్యక్తం చేసింది. పది రోజుల నుంచి అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. ఇటీవల తాను సెంట్రల్ యూరప్ ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చాక అస్వస్థత లక్షణాలు బయటపడినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
"దాదాపు పది రోజుల క్రితం నుంచి అలసట, శరీరంలో వణుకు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి."
-గ్రెటా థన్‌బర్గ్, పర్యావరణ ఉద్యమకారిణి.
సెంట్రల్ యూరప్ ప్రయాణం ముగించుకుని వచ్చాక... తన తండ్రితో సహా స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించింది గ్రెటా. అయితే తాను ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోలేదని తెలిపింది.
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని... ప్రజలు ముఖ్యంగా యువత ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది థన్‌బర్గ్. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు గుమిగూడడం సరైనది కాదని... ప్రతిఒక్కరూ డిజిటల్ మాధ్యమాల వేదికగా ఈ విషయంపై నిరసనలు తెలపాలని పిలుపునిచ్చింది.
ఇప్పటి వరకు స్వీడన్లో 2వేల 272 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి : కరోనా వైరస్ సోకితే రుచి, వాసన తెలియదు