తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆక్స్​ఫర్డ్​ వేదికగా ఒక్క చోట చేరిన మలాలా, థన్​బర్గ్​ - గ్రెటా థన్​బర్గ్

యువ కార్యకర్తలిద్దరూ ఒక్క చోట చేరారు. ఒకరు పర్యావరణ పరిరక్షణ కోసం గళమెత్తితే, మరొకరు బాలికల విద్య కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొన్నారు. వారే మలాలా యూసఫ్ జాయ్, గ్రెటా థన్​బర్గ్.

greta malala
గ్రెటా, మలాలా

By

Published : Feb 26, 2020, 10:15 PM IST

Updated : Mar 2, 2020, 4:43 PM IST

స్వీడన్​కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్​బర్గ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్​జాయ్​ ఒక్క చోట చేరారు. ఇంగ్లండ్​లోని ప్రఖ్యాత ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయంలో వీరు కలుసుకున్నారు.

వీరిద్దరు కలుసుకున్న ఫొటోలను ఇరువురూ తమ సామాజిక మధ్యమాలలో పోస్ట్ చేశారు. తన రోల్​ మోడల్​ను కలిసినందుకు సంతోషంగా ఉందని గ్రెటా ట్విట్టర్​లో రాసుకొచ్చింది. ఈ యువ కార్యకర్తలిద్దరినీ ఒకే ఫొటోలో చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అయితే వీరు ఏ విషయాలపై చర్చించుకున్నారన్నది తెలియలేదు.

ప్రస్తుతం ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు మలాలా. బ్రిస్టల్​లో​ ఈ వారం జరగనున్న ఓ పాఠశాల సమ్మెలో పాల్గొనేందుకు గ్రెటా లండన్​​కు వచ్చినట్లు సమాచారం.

గ్రెటా థన్​బర్గ్

పర్యావరణాన్ని కాపాడేందుకు గ్రెటా థన్​బర్గ్​(17) రెండేళ్ల క్రితం స్వీడన్ పార్లమెంట్​ ముందు ప్రతీవారం నిరసన చేయడం ప్రారంభించారు. క్రమక్రమంగా ఆ నిరసన ఉద్యమంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యావరణం కోసం నిరసన చేసేలా ప్రభావితం చేసింది.

మలాలా

పాకిస్థాన్​కు చెందిన మలాలా(22) బాలికలకు పాఠశాల విద్య కోసం పాటుపడ్డారు. 2012లో పాఠశాల నుంచి తిరిగి వస్తున్న క్రమంలో తాలిబన్ల బీకర కాల్పులను ఎదుర్కొన్నారు. మృత్యువును జయించిన మలాలా... అనంతరం బర్మింగ్​హమ్​కు నివాసాన్ని మార్చారు. ఆమె చూపిన తెగువకు 2014లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ అవార్డు తీసుకున్న అత్యంత పిన్న వయస్కురాలు మలాలానే కావడం విశేషం.

Last Updated : Mar 2, 2020, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details