అక్కడి పర్యటక ప్రాంతాలు వెలవెల.. బోసిపోయిన రోడ్లు కరోనా నియంత్రణకు ప్రధాని మోదీ పిలుపు మేరకు.. భారతదేశంలోని ప్రజలంతా ఇవాళ జనతా కర్ఫ్యూ పాటించారు. ఈ సందర్భంగా నగరాలు, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈ తరహాలోనే పలు దేశాల్లో నిర్బంధ ఆంక్షలు విధించారు.
ఖాళీగా మారిన రోడ్లు
గ్రీస్ దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సాధారణంగా ఆదివారం.. పర్యటకుల రద్దీతో కనిపించే ఏథెన్స్లోని ప్రముఖ ప్రదేశాలు వైరస్ కారణంగా విధించిన ఆంక్షలతో బోసిపోయాయి. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. శనివారం నాటికి మరో 35 కేసులు పెరిగి దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 530కి చేరింది. ఇప్పటి వరకు 13 మంది మరణించారు.
ఆంక్షల నడుమ బ్రిటన్...
బ్రిటన్లో కరోనా నియంత్రణ మేరకు అన్ని పబ్బులు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లను మూసేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే నిత్యం కోలాహలంగా ఉండే థియేటర్ ల్యాండ్.. శనివారం రాత్రి వెలవెలబోయింది.
ప్రతి నెలా పరిస్థితిని సమీక్షించి.. ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకుంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలతో పోలిస్తే.. బ్రిటన్లో వైరస్ వ్యాప్తి కాస్త తక్కువగానే ఉందని బోరిస్ పేర్కొన్నారు. శనివారం నాటికి బ్రిటన్లో 5,018 కేసులు నమోదు కాగా.. 233 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3లక్షల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. 13వేలమందికిపైగా మహమ్మారికి బలయ్యారు.