లాక్డౌన్లతో కట్టుదిట్టం చేసినా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా, మెక్సికో దేశాల్లో పెరుగుదల చూస్తే ఈ మహమ్మారికి అంతం దగ్గరలో లేదని స్పష్టంగా అర్థమవుతోంది!
అయినప్పటికీ చాలా దేశాలు లాక్డౌన్లు సడలింపులు ఇస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిస్తున్నాయి. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే కర్మాగారాలకు అనుతులు ఇస్తున్నారు. అయినప్పటికీ కరోనా విజృంభిస్తూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 49.33 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 3.21 లక్షల మంది మరణించారు.
కరోనా బాధిత దేశాల జాబితాలో.. పశ్చిమ ఐరోపా దేశాలను దాటి కొత్తగా రష్యా, బ్రెజిల్ ముందుకు దూసుకొచ్చాయి. అమెరికా తర్వాత ఈ రెండు దేశాలు నిలవటం కొవిడ్ తీవ్రతను తెలియజేస్తోంది. రష్యాలో కొత్త కేసులతో పాటు హాట్స్పాట్లు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా తర్వాత రష్యాలోనే కేసుల తీవ్రత అధికంగా ఉంది. అమెరికాలో 15 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 92 వేల మంది మరణించారు.
రెండో స్థానానికి రష్యా..
రష్యాలో గడిచిన 24 గంటల్లో 9,263 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. వీటిలో సగం కేసులు రాజధాని మాస్కోలోనే నమోదయ్యాయి. ఇప్పటికి 2,837 మంది మృత్యువాత పడ్డారు.
రష్యాలోని రెండో అతిపెద్ద నగరం సెయింట్ పీటర్స్బర్గ్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఏ కారణంతో మరణించినా.. శవపేటికల్లోనే మృతదేహాలను తరలిస్తున్నారు.