ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మహా విలయం కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఐరోపాలో రెండో వేవ్ ప్రారంభమైన క్రమంలో పలు దేశాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయిలో 52వేల కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. బల్గేరియా ప్రధానమంత్రి బోయికో బోరిస్సోవ్కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
కరోనా మహమ్మారి మహా విలయం
By
Published : Oct 26, 2020, 7:59 AM IST
ప్రపంచ దేశాలపై కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో రికార్డులు నమోదవుతున్నాయి. ఆదివారం 4 లక్షల కేసులు వెలుగుచూశాయి. మరో 4.5వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఐరోపాలోని పలు దేశాల్లో రెండో వేవ్ ప్రారంభమైంది. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటిలీ వంటి దేశాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయిలో 52 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసులు: 43,323,674
మరణాలు: 1,158,825
కోలుకున్నవారు: 31,897,793
యాక్టివ్ కేసులు: 10,267,056
అమెరికాలో వైరస్ విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 60, 889 మందికి వైరస్ సోకింది. 442 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 89 లక్షలకు చేరువైంది.
బ్రెజిల్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 12,900 కేసులు నమోదయ్యాయి. మరో 463 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 54 లక్షలకు చేరువైంది.
రష్యాలో కొవిడ్-19 వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 16,710 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 229 మంది మరణించగా.. అందులో మాస్కోలోనే 62 మంది ప్రాణాలు కోల్పోవటం నగరవాసులను ఆందోళన కలిగిస్తోంది. ఒక్క మాస్కోలోనే ఇప్పటి వరకు 6442 మంది మృతి చెందారు.
చైనాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కష్గర్ నగరంలో కొత్తగా 100 కేసులు నమోదయ్యాయి. పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ కేసులు బయటపడినట్లు అధికారులు తెలిపారు. అయితే.. వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదన్నారు.
ఫ్రాన్స్‌లో కరోనా పంజా విసురుతున్న క్రమంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజు కేసుల్లో ఆదివారం 52వేల కేసులతో సరికొత్త రికార్డు నమోదైంది. గత శనివారం 45,422 కేసులే ఇప్పటి వరకు అత్యధికం.. కాగా ఆదివారం ఆ రికార్డును వెనక్కి నెట్టింది.
బ్రిటన్‌లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం 19,790 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 151 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8.73 లక్షలు దాటింది.
బల్గేరియా ప్రధానమంత్రి బోయికో బోరిస్సోవ్కు కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ సోకిన ప్రభుత్వ అధికారిని కలిసిన తర్వాత స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు ప్రధాని. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.