అమెరికాపై కరోనా పంజా.. ఒక్కరోజే 81 వేల కేసులు - కరోనా వార్తలు
ప్రపంచంపై కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. జనసాంద్రత అధికంగా ఉన్న దేశాలతో పాటు చిన్న దేశాల్లోనూ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 4.90 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. కొలంబియాలో కేసులు 10 లక్షలకు చేరువయ్యాయి. అమెరికాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 81 వేల కేసులు.. 903 మరణాలు నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి
By
Published : Oct 24, 2020, 8:59 AM IST
ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. రోజురోజుకూ వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 4.90 లక్షల కేసులు వెలుగుచూశాయి. మరో ఆరున్నర వేల మందికిపైగా వైరస్‌కు బలయ్యారు. మొత్తం మరణాలు 11 లక్షల 49 వేలు దాటాయి. అమెరికా, భారత్‌తో పాటు ఫ్రాన్స్, బ్రిటన్, బ్రెజిల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. ఫ్రాన్స్‌లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది.
మొత్తం కేసులు: 42,487,519
మరణాలు: 1,149,212
కోలుకున్నవారు: 31,423,343
యాక్టివ్ కేసులు: 9,914,964
అమెరికాలో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం మరో 81 వేల మంది వైరస్ బారినపడ్డారు. 903 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 87 లక్షలు దాటింది. రోగులతో ఆసుపత్రులు రద్దీగా మారాయి.
ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. పశ్చిమ ఐరోపా దేశాల్లో స్పెయిన్ తర్వాత ఈ మార్క్‌ను దాటిన రెండో దేశంగా, ప్రపంచవ్యాప్తంగా ఏడో దేశంగా నిలిచింది ఫ్రాన్స్. శుక్రవారం కొత్తగా 42వేలకుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే.. వాస్తవానికి వైరస్ బారిన పడిన వారి సంఖ్య అధికారిక లెక్కల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండోర్ ఐస్ స్కేటింగ్లపై రెండు వారాల నిషేధం విధించింది మసాచుసెట్స్. ఐస్ హాకీ కారణంగా 38 క్లస్టర్లలో వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
టర్కీలో వైరస్ విజృంభిస్తోంది. మే 6 తర్వాత తొలిసారి శుక్రవారం రికార్డు స్థాయిలో 2,165 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,57,693కు చేరింది.
అర్జెంటీనాలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను నవంబర్ 8 వరకు పొడిగించింది ప్రభుత్వం. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్.