కరోనా పంజా.. కోటీ 95 లక్షలు దాటిన కేసులు - corona in America
ప్రపంచంపై కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ ధాటికి వివిధ దేశాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా సహా పలు దేశాల్లో మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కేసుల్లో స్పెయిన్‌ను వెనక్కి నెట్టి తొమ్మిదోస్థానానికి చేరుకుంది కొలంబియా. మొత్తం కేసుల సంఖ్య కోటీ 95 లక్షలు దాటింది. 7. 24లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
కరోనా పంజా.. కోటీ 95 లక్షల దాటిన కేసులు
By
Published : Aug 8, 2020, 6:45 PM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహా విలయం కొనసాగుతోంది. రోజూ కొత్తగా 3 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. జనాభా అధికంగా ఉన్న దేశాలతో పాటు చిన్న చిన్న దీవుల్లోనూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ కట్టడి అయినట్లు ప్రకటించుకున్న దేశాల్లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.
మొత్తం కేసులు: 19,573,743
మరణాలు: 724,723
కోలుకున్నవారు: 12,568,981
యాక్టివ్ కేసులు: 6,280,039
అమెరికాలో..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే కేసులు 50 లక్షలు దాటాయి. లక్షా 64 వేల మంది వైరస్‌కు బలయ్యారు. ఆంక్షలు సడలించి.. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది.
బ్రెజిల్లో..
కేసుల సంఖ్యలో రెండో స్థానంలో కొనసాగుతోంది బ్రెజిల్. రోజుకు 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. దాదాపు లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
సింగపూర్‌లో 55వేలు..
సింగపూర్‌లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్తగా మరో 132 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 55వేల మార్కుకు చేరువైంది. కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారిలో అధికంగా విదేశాలకు చెందిన కూలీలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో సామాజిక వ్యాప్తి ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 48,297 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
పాక్‌లో మరో 842 కేసులు
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శనివారం మరో 842 మంది వైరస్ బారిన పడ్డారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2.83 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 6,068 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,59,604 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
స్పెయిన్‌ను వెనక్కి నెట్టిన కొలంబియా..
కరోనా మహమ్మారి ఉద్ధృతితో కేసుల సంఖ్యలో కొలంబియా దూసుకెళుతోంది. స్పెయిన్‌ను వెనక్కినెట్టి తొమ్మిదోస్థానానికి చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 3.67 లక్షలకు చేరాయి. స్పెయిన్‌లో ఈ సంఖ్య 3.61 లక్షలుగా ఉంది. అయితే మరణాల పరంగా స్పెయిన్ కన్నా చాలా దూరంలో ఉండటం ఊరట కలిగించే విషయం.