2060 నాటికి వాతావరణంలో కార్బన్ తటస్థంగా ఉండే విధంగా చైనా ప్రతిపాదించిన ప్రణాళికను.. జర్మనీ ఛాన్స్లర్ ఎంజెలా మెర్కెల్ స్వాగతించారు. అదే సమయంలో పారిస్ వాతావరణ ఒప్పందం లక్ష్యాలపై అమెరికా వైఖరిని తప్పుబట్టారు.
వాతావరణంలోని ఉద్గారాల తగ్గింపే లక్ష్యంగా యూరోపియన్ యూనియన్ సొంత వ్యవస్థకు కసరత్తులు చేసుకుంటున్న సమయంలో.. చైనా ప్రణాళిక ఎంతో చక్కగా ఉందంటూ జర్మనీ పార్లమెంటులో ప్రస్తావించారు మెర్కల్.
"వాతావరణాన్ని పరిరక్షించేందుకు చైనాతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందని భావిస్తున్నా. ఇప్పుడు చైనానే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఉద్గారిణి. వాతావరణాన్ని పరిరక్షించే విషయంలో చైనాకు సహకరించడం చాలా ముఖ్యం."
-- ఎంజెలా మెర్కెల్, జర్మనీ ఛాన్స్లర్
భారీగా ఉద్గారాలు వెదజల్లుతున్న దేశాల మాదిరిగా కాకుండా.. చైనా పారిస్ వాతావరణ ఒప్పందానికి అండగా నిలుస్తుందని మెర్కెల్ అన్నారు. అయితే అమెరికా వ్యతిరేకిస్తుండటంపైనా పరోక్షంగా విమర్శలు చేశారు. వాతావరణంలో ఉద్గారాలను తగ్గిండమనేది చాలా ప్రతిష్టాత్మకమైన లక్ష్యమని.. దానిని నెరవేర్చడానికి ఐరోపా సమాఖ్య పాత్ర కీలకమని మెర్కెల్ పేర్కొన్నారు.
1990తో పోలిస్తే 2030 నాటికి భూమిపై ఉద్గారాలను.. కనీసం 55 శాతం తగ్గించే లక్ష్యంతో ఈయూ ఓ ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే దీనిని 27 దేశాల కూటమి సభ్యులు అంగీకారం తెలిపారు. ముఖ్యంగా బొగ్గు గనులపై ఆధార పడిన దేశాలు మాత్రం విబేధించాయి.
ఈయూ సభ్యుల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావటానికి జర్మనీ ఎంతో కృషి చేస్తున్నట్లు ఆ దేశ పర్యావరణ మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఆర్థికంగా బలోపేతమైన ఈయూ, చైనా.. పారిస్ ఒప్పందాన్ని బలపరుస్తున్నాయని అన్నారు.