జర్మనీలో వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అక్కడ కొత్తగా 37,120 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 154 మంది మరణించారు. దీనితో మొత్తం మరణాల సంఖ్యం 96,346కు చేరింది. టీకాలు తీసుకోని వారే అధికంగా కరోనా బారిన పడుతున్నారని జర్మనీ వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ టీకాల పంపిణీని వేగవంతం చేయాలని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటివరకూ టీకాలు తీసుకోని పౌరులంతా త్వరగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రష్యాలోనూ..
రష్యాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అక్కడ తాజాగా 1,192 మరణాలు నమోదయ్యాయి. మరో 40,735 కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు. కరోనా తీవ్రతను నియంత్రించేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు పెయిడ్ హాలిడేను ప్రకటించారు. అవసరమైతే దీనిని పొడిగించేందుకు వెనుకాడొద్దని ఆదేశాలు జారీచేశారు పుతిన్. మరోవైపు.. దేశంలోని 14.6కోట్ల జనాభాలో 40% మందికి టీకా అందింది. శుక్రవారం ఒక్కరోజే 57 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు.