ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కోరలు చాస్తోంది. మరీ ముఖ్యంగా ఐరోపా కేంద్రంగా విజృంభిస్తోంది. అందులోనూ జర్మనీ పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ కరోనా వైరస్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉద్ధృతి చూపిస్తోంది. తాజాగా 50,196 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
జర్మనీలో కరోనా వైరస్ అడుగుపెట్టిన దగ్గరి నుంచి 50 వేల కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. అలాగే అక్టోబర్ మధ్యనుంచి అక్కడ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఇవి అనూహ్యరీతిలో వెలుగుచూస్తున్నాయని జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ఆందోళన వ్యక్తం చేశారు. 'కరోనా మహమ్మారి కొత్త పద్ధతిలో వేగంగా తిరిగొస్తోంది. తగిన కట్టడి చర్యలతో వైరస్‌ను అదుపులోకి తీసుకురావాలి' అని మెర్కెల్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.