కరోనా విజృంభణ, వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో జీ-7 శిఖరాగ్ర సదస్సులో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డోసుల్ని వివిధ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని సభ్యదేశాలు నిర్ణయించనున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలు కొవిడ్‌తో అతలాకుతలమవుతున్న తరుణంలో ధనిక దేశాలు మిగులు టీకాలను నిల్వ చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జీ-7 కూటమి నుంచి ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వచ్చే సంవత్సరం నాటికి 100 మిలియన్ మిగులు కరోనా టీకా డోసుల్ని పంపిణీ చేస్తామని బ్రిటన్ హామీ ఇచ్చింది. వీటిలో కొన్నింటినీ వచ్చే కొన్ని వారాల్లోనే అందజేస్తామని తెలిపింది. దాదాపు 400 మిలియన్ డోసులకు ఆర్డర్లు పెట్టిన బ్రిటన్.. పేద దేశాలకు అండగా నిలవకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జీ-7 వేదికగా ఆ అపవాదును తుడిచేసుకునే ప్రయత్నం చేశారు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్. యూకేలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైన కారణంగా.. మిగులు టీకాలను ఇతర దేశాలకు పంచే స్థితికి చేరుకున్నామని ప్రకటించారు. జీ-7 కూటమిలోని ఇతర దేశాలు సైతం ఇదే తరహాలో సాయానికి ముందుకు వస్తాయని ఆకాంక్షించారు. అనంతరం బ్రిటన్ ప్రధాని కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఒక బిలియన్ డోసుల పంపిణీకి దేశాధినేతలు అంగీకరించనున్నారని ఆ ప్రకటన వెల్లడించింది.