గ్రూప్ ఆఫ్ సెవెన్(జీ7) దేశాల విదేశాంగ మంత్రులు లండన్‌లో సమావేశమయ్యారు. రెండేళ్ల వ్యవధిలో తొలిసారి ప్రత్యక్ష సమావేశం నిర్వహించారు. వాతావరణ మార్పులు, చైనా అంశమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. జీ7 శాశ్వత దేశాలతో పాటు ఆతిథ్య దేశాల హోదాలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా.. ఈ భేటీకి హాజరయ్యాయి.
రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఆయా దేశాల ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించనున్నారు. మయన్మార్ సైనిక తిరుగుబాటు, సిరియాలో మానవహక్కుల ఉల్లంఘన, ఇథియోపియాలో టిగ్రే సంక్షోభం, అఫ్గాన్‌లో పరిస్థితులపై సమాలోచనలు జరపనున్నారు. ఉక్రెయిన్‌తో సరిహద్దు వెంబడి రష్యా తన సైన్యాన్ని మెహరించడం, విపక్ష నేత అలెక్సీ నావల్నీని నిర్బంధించడంపైనా జీ7 చర్చిస్తుందని యూకే విదేశాంగ కార్యాలయం వెల్లడించింది.
వన్నెతరగని జీ7!
జీ7 కూటమికి అంతర్జాతీయ వేదికపై ఇప్పటికీ పలుకుబడి ఉందని ఆతిథ్య బ్రిటన్ బ్రిటన్ భావిస్తోంది. రష్యా, చైనా, ఇరాన్ దేశాల దూకుడు ప్రజాస్వామ్య దేశాలకు ముప్పుగా పరిణమిస్తోందని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.