బ్రిటన్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారి డొమినిక్ కమ్మింగ్స్ లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించి 260 కిలోమీటర్లు ప్రయాణించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవకాశాన్ని అందిపుచ్చుకున్న విపక్షాలు ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. కమ్మింగ్స్పై ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం... కరోనా సమయంలో బ్రిటీష్ ప్రజల త్యాగాలను అవమానించటమేనని మండిపడ్డాయి.
" ఇది ప్రధానమంత్రికి పరీక్ష. అందులో ఆయన విఫలమయ్యారు. డొమినిక్ కమ్మింగ్స్పై బోరిస్ జాన్సన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అనేది ప్రజలు చేసిన త్యాగాలను అవమానించటమే. "
– కేయిర్ స్టార్మెర్, ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత
బోరిస్‌కు ఈ విషయంలో సొంత పార్టీ ఎంపీల నుంచీ విమర్శలు ఎదురయ్యాయి. ప్రధాని ప్రధాన వ్యూహ సలహాదారు కమ్మింగ్స్ను విధుల్లో నుంచి తొలగించాలని కోరుతున్న అధికార కన్సర్వేటివ్ పార్టీ పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరుగుతోంది.
బ్రిటన్ విదేశీ కార్యదర్శి భారత సంతతికి చెందిన లీసా నంది కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. కమ్మింగ్స్పై చర్యలు తీసుకోకపోవటం వల్ల ప్రధాని తన స్నేహితులకు ఒక నిబంధన, ఇతరులకు ఒక నిబంధన ఉందని నిరూపించారని ఆరోపించారు.