పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు, కిలోమీటర్ల కొద్దీ బారులుతీరిన వాహనాలు, వారిమధ్య వాగ్వాదాలు, రద్దీని నిలువరించేందుకు పనిచేస్తున్న సైన్యం.! ఇవీ.. బ్రిటన్‌లోని పెట్రోల్ స్టేషన్ల ముందు కనిపిస్తున్న దృశ్యాలు. అక్కడ రిఫైనరీల నుంచి ఇంధనాన్ని సరఫరా చేసే ట్యాంకర్ డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. అయితే కరోనా వైరస్, బ్రెగ్జిట్ సహా పలు సమస్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బ్రిటన్‌తో పాటు.. అమెరికా, జర్మనీలోనూ సమస్య తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఇతర దేశాల నుంచి ట్రక్ డ్రైవర్లు..!
క్రిస్మస్ సమీపిస్తున్న నేపథ్యంలో రద్దీని నివారించేలా. ఇతర దేశాల నుంచి ట్రక్ డ్రైవర్లను రప్పించేందుకు అత్యవసర వీసాలను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 5వేల మంది ట్రక్కు డ్రైవర్లకు మూడు నెలల కాలానికి వీసాలు అందించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ప్రక్రియ చాలా ఆలస్యం అయిందని.. అయినప్పటికీ కొత్త వీసా ప్రణాళికను స్వాగతిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
దేశంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల ముందు 'నో స్టాక్' బోర్డు దర్శనమిచ్చాయి. గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నప్పటికీ తమకు ఇంధనం లభించట్లేదని వాహనదారులు వాపోతున్నారు. చాలామంది సహనం కోల్పోయి గొడవలకు దిగుతున్నారు. అయితే.. పౌరులు కంగారుపడి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వల్లే ఈ కొరత ఏర్పడినట్లు పెట్రోల్ రిటైలర్స్ అసోసియేషన్ ఛైర్మన్ బ్రియాన్ మాడర్సన్ అన్నారు.
"దేశంలో ఇంధనం పుష్కలంగా ఉంది. అయితే ప్రస్తుతం అది వాహనదారులకు అందుబాటులో లేదు. పెట్రోలియం టెర్మినల్స్, రిఫైనరీలలో ఉంది. త్వరలోనే సరఫరా చేస్తాం."