రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు ప్రారంభమైనట్లు అక్కడి ప్రముఖ మీడియా సంస్థ 'మీడియాపార్ట్' పేర్కొంది. రూ.59 వేల కోట్లు విలువ చేసే ఈ ఒప్పందం విషయంలో దర్యాప్తు జరిపేందుకు ఓ న్యాయమూర్తిని కూడా నియమించినట్లు తెలిపింది. భారత్- ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి ఒప్పందం కావడంతో ఈ అంశానికి ఇరు దేశాల్లో ప్రాధాన్యం ఏర్పడింది.
ఫ్రాన్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్‌కు చెందిన ఫినాన్షియల్ క్రైమ్స్ విభాగం సైతం దర్యాప్తు ప్రారంభమైనట్లు ధ్రువీకరించిందని 'మీడియాపార్ట్' పేర్కొంది. ఈ ఒప్పందం ఖరారు సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలండే వ్యవహరించిన తీరుపైనే ప్రధానంగా దర్యాప్తు సాగనున్నట్లు తెలిపింది.
రఫేల్ ఒప్పందంపై 'మీడియాపార్ట్' సొంతంగా పలు పరిశోధనాత్మక కథనాలను ప్రచురించింది. ఒప్పందం ఖరారు సమయంలో పలువురికి ముడుపులు ఇచ్చినట్లు పేర్కొంది. అలాగే కొంతమందికి కావాలనే అనుకూలంగా వ్యవహరించినట్లు తెలిపింది. ఈ విషయం అప్పటి ఫ్రెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ చీఫ్ హ్యూలెట్ దృష్టికి వచ్చినప్పటికీ.. విచారణను పక్కకు పెట్టేశారని ఆరోపించింది. ఒప్పందాలు ప్రభుత్వాల స్థాయిలో జరిగిన నేపథ్యంలో ఫ్రాన్స్ దేశానికే అప్రతిష్ఠ వచ్చే అవకాశం ఉందన్న వాదనతో ఆయన తన సహచరులను ఒప్పించే ప్రయత్నం చేశారని తెలిపింది.