కరోనా వ్యాప్తి మొదలై ఏడాది దాటినా... మహమ్మారి వల్ల కలిగే అనోస్మియా(వాసనను పసిగట్టలేకపోవడం) సమస్యకు పరిష్కారం దొరకడం లేదని వైద్యులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మందిలో ఈ సమస్య ఆరు నెలల వరకు ఉంటుందని, మరికొందరిలో ఇది ఏడాది పాటు కొనసాగుతోందని పేర్కొన్నారు. యువతలోనే ఈ సమస్య అధికంగా ఉందన్న నిపుణులు... బాధితుల్లో కుంగుబాటు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. కొందరు ఈ సమస్య నుంచి బయటపడటం అసాధ్యమని అంటున్నారు.
గాబ్రియెల్లా సమస్య ఇలా...
గతేడాది నవంబర్లో కొవిడ్ బారినపడిన ఓ యువతి... వైరస్ను జయించిన తర్వాత కూడా ఎలాంటి వాసనను పసిగట్టలేకపోతున్నట్లు తెలిపారు.
"వాసన పసిగట్టలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అప్పుడప్పుడు నా నుంచి దుర్వాసన వస్తుందేమో అనుమానం కూడా వస్తుంది. ఎలాంటి వాసనను పసిగట్టలేకపోవడం వల్ల సరిగా తినక, బరువు తగ్గతున్నాను. అత్మవిశ్వాసం కోల్పోతున్నాను."