ఇప్పుడు ప్రపంచం లాక్‌డౌన్ దిశగా వెళుతోంది. సరిహద్దుల్ని మూసేసుకుంటూ ఏ దేశానికాదేశం, ఏ ప్రాంతానికా ప్రాంతం రక్షణాత్మక చర్యలకు దిగుతున్నాయి. అన్ని రకాల రవాణా సాధానాల్ని పూర్తిగా నిలిపివేస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు కదలకుండా కట్టుదిట్టం చేస్తున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న వివిధ మార్గాల్లో లాక్‌డౌన్ అత్యంత కీలకమైంది. కరోనా రక్కసి జడలు విప్పి ప్రపంచాన్ని చుట్టుముట్టిన చైనాలోని వుహాన్‌లోనే తొలిసారిగా లాక్‌డౌన్ ప్రారంభమైంది. వుహాన్ అంటే చిన్న నగరమేమీ కాదు.. కోటీ 10 లక్షల జనాభా.. అలాంటి నగరంతో పాటు, ఇది ఉన్న హుబెయ్ ప్రావిన్సులో దీనికి చుట్టుపక్కల ఉన్న పలు ప్రాంతాలను మూసేయడానికి రెండు నెలల క్రితం చైనా తీసుకున్న నిర్ణయానికి ప్రపంచం నివ్వెరపోయింది. వుహాన్‌లో గత 10 రోజులుగా కేవలం ఒక అంకె(సింగిల్ డిజిట్) కేసులే నమోదవుతున్నాయంటే లాక్‌డౌన్ నిర్ణయం ఎంతమేర సత్ఫలితాలనిచ్చిందో స్పష్టమవుతోంది. ఇప్పుడు భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కూడా ఇదే బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తదితర దేశాలు లాక్‌డౌన్ ఎలా చేపట్టాయి? అవి తీసుకున్న చర్యలేమిటి?
చైనా ఏం చేసింది?
జనవరి 23న వుహాన్‌లో చైనా లాక్‌డౌన్ చేపట్టింది. చరిత్రలోనే ఇంతటి కట్టుదిట్టమైన లాక్‌డౌన్ ఎక్కడా జరగలేదని నిపుణులు చెబుతున్నారు.
- నగరం లోపల, బయట నుంచి ప్రజా రవాణా సహా అన్ని రకాల వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిలిపేశారు. కరోనా కట్టడి చర్యలకు మినహా ఎలాంటి ప్రైవేటు వాహనాలనూ అనుమతించలేదు.
- అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నివాసాల్లో ఎవరి ఇళ్లలో వాళ్లను ఉంచేశారు. బయట నుంచి ఎవరినీ రానివ్వలేదు. ఆరోగ్య సమస్యలున్న వృద్ధులు, దివ్యాంగులకు సహకరించే అధికారులు, సిబ్బందిని మాత్రమే అనుమతించారు.
- చైనాలోని విద్యాసంస్థలకు నిరవధికంగా సెలవులిచ్చారు.
- మందుల షాపులు, సూపర్ మార్కెట్లు మినహా అన్నింటినీ పూర్తిగా మూసేశారు.
- నిత్యావసర వస్తువులు, వైద్యసాయం అవసరమైన వారినే బయటికి అనుమతించారు. అదికూడా తప్పనిసరిగా మాస్కుల ధరిస్తేనే.
- రెండు వారాల తర్వాత పరిస్థితిని మరింత కట్టుదిట్టం చేశారు. కరోనా బాధితుల కోసం ఇంటింట సోదాలు నిర్వహించారు. ఇలా కనుగొన్న వారిని నిర్బంధంగా వేరుగా ఉంచారు.
- రెణ్నెల్ల తర్వాత క్రమేపీ నిబంధనల్ని సడలించారు. కీలక పరిశ్రమల్లో పనిచేసే వారిని తిరిగి విధుల్లోకి అనుమతించారు. బడులు, ప్రజారవాణాపై నిషేధం మాత్రం కొనసాగుతోంది.
ఇటలీలో ఏం జరిగింది?
ఇటలీలో మొదట్లో కరోనాపై పెద్దగా దృష్టిపెట్టలేదు. దీంతో అప్పటికే అది చేయిదాటిపోయే స్థితికి వ్యాపించింది. దీంతో దేశ ఉత్తర ప్రాంతంలో మార్చి 8న షట్‌డౌన్ మొదలుపెట్టారు. రెండు రోజుల తర్వాత దేశం మొత్తానికి దీన్ని వర్తిపజేశారు. అత్యవసరం, ఆరోగ్య కారణాలు, తప్పక పనిచేయాల్సిన వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించారు.
ఫ్రాన్స్‌లో ఏం చేశారు?