అణ్వాయుధాల నిషేధానికి సంబంధించిన మొట్టమొదటి ఒప్పందం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మారణాయుధాల నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించే దిశగా ఇది ఒక చరిత్రాత్మక అడుగు అని పలువురు అభివర్ణించారు. అణ్వస్త్ర దేశాలు మాత్రం దీన్ని గట్టిగా వ్యతిరేకించాయి.
రెండో ప్రపంచ యుద్ధసమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణు బాంబులు వేసి, వేల మందిని బలితీసుకుంది. అలాంటి ఘోరం పునరావృతం కాకుండా ఆ సామూహిక జనహనన ఆయుధాల నిషేధం కోసం దశాబ్దాలుగా ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం అణ్వస్త్ర నిషేధ ఒప్పందం తెరపైకి వచ్చింది. దీనికి తుది ఆమోదం తెలిపిన దేశాలు అణ్వాయుధాలను పూర్తిగా త్యజించాలి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా సంక్లిష్టం.
జపాన్ కూడా....!
అణ్వస్త్రాలు కలిగిన అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాలతోపాటు నాటో కూటమిలోని 30 దేశాలు ఆ ఒప్పందాన్ని సమర్థించలేదు. అణ్వస్త్ర దాడికి గురైన జపాన్ కూడా దీనికి పచ్చజెండా ఊపలేదు. అణ్వస్త్ర, అణ్వస్త్రేతర దేశాల మధ్య ఈ అంశంపై తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో నిషేధ ఒప్పందం నిష్ప్రయోజనమని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. అయితే 'ఇంటర్నేషనల్ కాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్' సంస్థ కృషి వల్ల ఒప్పందం విషయంలో ముందడుగు పడింది. 2017 జులైలో ఐరాస సర్వప్రతినిధి సభ దీనికి ఆమోదం తెలిపింది. 120కిపైగా దేశాలు దీనికి పచ్చజెండా ఊపాయి. అనంతరం ఈ ఒప్పందం అమల్లోకి రావాలంటే కనీసం 50 దేశాలు దాన్ని ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. గత ఏడాది అక్టోబరులో 50వ ర్యాటిఫికేషన్ పూర్తయింది. ఆ తర్వాత నిర్దేశిత రీతిలో 90 రోజుల విరామాన్ని పూర్తిచేసుకొని శుక్రవారం నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చింది.