కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2 వైరస్ ఇన్‌ఫెక్షన్ తొలుత 2019 డిసెంబరులో ఉత్పన్నమైందని చైనా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే దానికి రెండు నెలల ముందే ఆ మహమ్మారి వ్యాప్తి ఆరంభమై ఉండొచ్చని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
గణిత నమూనా సాయంతో..
కరోనా వైరస్ మూలాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి. 2019 డిసెంబరు మొదట్లో అధికారికంగా మొదటి కేసు నమోదైంది. దానికి ముందే ఈ మహమ్మారి విజృంభణ మొదలై ఉండొచ్చన్న వాదనలు ఉన్నాయి. తాజాగా కెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ రాబర్ట్స్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఒక గణిత నమూనా సాయంతో పరిశీలనలు జరిపారు. నిజానికి ఒక జీవజాతి అంతరించిపోయిన తేదీని లెక్కించడానికి ఈ నమూనాను రూపొందించారు. దానికి కొన్ని మార్పులు చేసి, కరోనా మహమ్మారి ఆరంభ సమయాన్ని నిర్ధరించేందుకు ఉపయోగించారు.