పోలీసుల ఫొటోలు, వీడియోలను చిత్రీకరించకూడదని ఫ్రాన్స్ ప్రతిపాదించిన వివాదాస్పద బిల్లుపై ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. వేలాది మంది బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు. అనేక కార్లకు నిప్పంటించారు. ఓ బ్యాంకుపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పత్రాలను కాల్చేశారు. నిరసనలను అడ్డుకున్న పోలీసులపైకి వస్తువులను విసిరారు. ఓ ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశారు.
నలుపు రంగు వస్త్రాలు ధరించి నిరసనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరిని నిలువరించడానికి జాత్యహంకార ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారుల్లో 22 మందిని అరెస్టు చేశామని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డర్మానిన్ తెలిపారు.
జాత్యహంకార వైఖరిని అవలంబిస్తున్న పోలీసు అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ చెప్పారు. పోలీసుల దుష్ప్రవర్తనపై ఫిర్యాదు చేయడానికి ఓ ఆన్లైన్ వేదికను తీసుకువస్తామని తెలిపారు.