Fiery speeches at UNGA: రష్యా తన అణు బలగాలను క్రియాశీలకం చేయడం 'భయానక పరిణామం' అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అణు వివాదానికి సంబంధించిన ఆలోచన అనూహ్యమైనదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య క్రమంలో... ఐరాస సాధారణసభ సోమవారం అత్యవసరంగా ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇలా భేటీ కావడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. అబ్దుల్లా షాహిద్ దీనికి అధ్యక్షత వహించారు. నాటో దళాలు రష్యాపై దాడిచేసే ప్రమాదముందని, అణు బలగాలు అప్రమత్తంగా ఉండాలని పుతిన్ ఆదేశించడం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని గుటెరస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఉక్రెయిన్ విషాదం ఎదుర్కొంటోంది. ఇది మిగిల్చే వినాశకర ప్రభావాలను ప్రాంతీయంగా ఎదుర్కొంటున్నాం. రష్యా తన అణు బలగాలను చైతన్యపరచడం అత్యంత భయానకర పరిణామం. ప్రస్తుతం తుపాకులు మాట్లాడుతున్నాయి. అయితే, రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చలు.. యుద్ధాన్ని ఆపి, సమస్యకు దౌత్య పరిష్కారాలు చూపగలవని ఆశిస్తున్నాను. అయిందేదో అయిపోయింది. ఇక చాలు. సైనికులు వెనక్కు తగ్గి, బ్యారెక్‌లకు వెళ్లిపోవాలి. నాయకులు శాంతం వహించి, ప్రజలను రక్షించాలి.
ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను, సరిహద్దులను పరిరక్షించాల్సి ఉంది. ఉక్రెయిన్‌పై దాడి అంతర్జాతీయ చట్టానికి, ఐరాస ఛార్టర్‌కు సవాళ్లు విసురుతోంది. వివాదం మరింత ముదిరితే భయనక పరిణామాలకు, ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. రష్యా ఉక్రెయిన్‌లోని సైనిక లక్ష్యాలతో పాటు... అక్కడి ముఖ్యమైన పౌర వసతులను కూడా భారీగా ధ్వంసం చేస్తోంది. భవిష్యత్తులో ఇది ఐరోపాలో అత్యంత మానవతా, శరణార్థుల సంక్షోభంగా మారవచ్చు"
-ఆంటోనియో గుటెరస్, ఐరాస చీఫ్
దొనెట్క్స్, లుహాన్స్క్ సహా ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో అత్యవసర కార్యక్రమాల నిమిత్తం సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ నుంచి సుమారు రూ.150 కోట్లు (20 మిలియన్ డాలర్లు) విడుదల చేసినట్టు తెలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టడం ద్వారా రష్యా ఆ దేశ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని ప్రస్తుత సెషన్స్ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ పేర్కొన్నారు. తక్షణం కాల్పులు విరమించి, ఆ దేశంతో సంప్రదింపులు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
పరిస్థితులు మరింత దిగజారడం విచారకరం: భారత్
రష్యా దూకుడును నిలువరించేందుకు ఐరాస భద్రతా మండలి, సాధారణ సభలు సోమవారం వేర్వేరుగా కీలక సమావేశాలు నిర్వహించాయి.
అత్యవసరంగా సాధారణ సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలంటూ తొలుత భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై నిర్వహించిన ఓటింగ్‌కు భారత్ దూరం పాటించింది. మొత్తం 11 దేశాలు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రత్యేక సమావేశానికి మార్గం సుగమమైంది. సాధారణ సభలో వీటో అధికారం పనిచేయదు. రష్యా తక్షణమే కాల్పులను విరమించాలన్న తీర్మానంపై భద్రతామండలి గత శుక్రవారం చేపట్టిన ఓటింగ్‌కు కూడా భారత్ దూరం పాటించిన సంగతి తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింత దిగజారడం తీవ్ర విచారకరమని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి పేర్కొన్నారు. బెలారస్ సరిహద్దుల్లో చర్చలు జరిపేందుకు సిద్ధమని ఉభయదేశాలు ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. భద్రతామండలిలో తాజా తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్‌కు దూరంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తృణమూల్, శివసేన నేతలు విమర్శించారు. రష్యాను స్ఫూర్తిగా తీసుకొని చైనా ఒకవేళ మన దేశంపైకి దండెత్తితే... ఇప్పుడు మనం కనబరుస్తున్న తటస్థ వైఖరి కారణంగా మిత్రుల మద్దతు కోల్పోవాల్సి వస్తుందని తృణమూల్ నేత మహువా మొయిత్రా హెచ్చరించారు.
సాధారణ సభలో కయ్యం- భగ్గుమన్న ఉక్రెయిన్, రష్యా రాయబారులు
సాధారణ సభ ప్రత్యేక సమావేశం సందర్భంగా రష్యా, ఉక్రెయిన్‌ల నడుమ విభేదాలు భగ్గుమన్నాయి. ఐరాసలో ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లెత్స్యా ఉద్వేగపూరితంగా మాట్లాడారు. "ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపాలి. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను, స్వతంత్రతను గుర్తించాలి. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా తన బలగాలను తక్షణమే, పూర్తిగా, భేషరతుగా వెనక్కు తీసుకుపోవాలి. దొనెట్స్క్, లుహాన్స్‌లను స్వతంత్ర భూభాగాలుగా గుర్తిస్తూ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలి. రష్యాకు తోడుగా బెలారస్ పోషిస్తున్న దుష్టపాత్రనూ సభ నిలువరించాలి. ఉక్రెయిన్... తన స్వాతంత్య్రంతో పాటు ప్రపంచ భద్రత కోసమూ ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోంది. ఉక్రెయిన్ మనుగడ సాగించలేకపోతే... ఐరాస, అంతర్జాతీయ శాంతి మనుగడ సాగించలేవు. ఉక్రెయిన్ మనుగడ సాగించలేకపోతే, ప్రజాస్వామ్యం విఫలమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విషయంలో భ్రమలు వద్దు" అని సెర్గీ పేర్కొన్నారు.