తెలంగాణ

telangana

ETV Bharat / international

పాపాల పాకిస్థాన్​కు ఎఫ్​ఏటీఎఫ్​ 'బ్లాక్​లిస్ట్'​ ముప్పు!

ఎఫ్​ఏటీఎఫ్​ బ్లాక్​ లిస్ట్​...! కొంతకాలంగా బాగా వినిపిస్తున్న మాట. త్వరలోనే పాకిస్థాన్​ను ఆ జాబితాలో చేర్చుతారని అంతా అంటున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినందుకు దాయాది దేశం ఇలా మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఏంటీ ఎఫ్​ఏటీఎఫ్​? పాక్​ ఇప్పుడు ఏ లిస్ట్​లో ఉంది? బ్లాక్​ లిస్ట్​లో చేర్చితే ఏమవుతుంది?

ఫైనాన్షియలాా యాక్షన్​ టాస్క్​ఫోర్స్​

By

Published : Oct 12, 2019, 11:32 AM IST

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్​కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిసారీ భంగపాటే ఎదురవుతోంది. ముంబయి పేలుళ్ల సూత్రధారి మసూద్​ అజార్​ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం, అమెరికా ప్రభుత్వం ఏటా అందించే ఆర్థిక సాయాన్ని ఇటీవల తరచూ నిలిపివేస్తూ ఉండడం ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఇదే తరహాలో పాకిస్థాన్​కు మరో ముప్పు పొంచి ఉంది. ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్​(ఎఫ్​ఏటీఎఫ్​) బ్లాక్​ లిస్ట్​లో ఆ దేశం చేరే అవకాశముంది. ఈనెల 13 నుంచి 16 వరకు పారిస్​ వేదికగా జరిగే సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనుంది ఎఫ్​ఏటీఎఫ్​.

2012 నుంచి ఎఫ్​ఏటీఎఫ్​ గ్రే లిస్ట్​లో ఉంది పాకిస్థాన్​. బ్లాక్​ లిస్ట్​లో ప్రస్తుతం ఉత్తర కొరియా, ఇరాన్​ మాత్రమే ఉన్నాయి. వాటి సరసన పాక్​ చేరేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 3 రోజుల సమావేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు దాయాది దేశాలు ఆత్రుతగా చూస్తున్నాయి.

ఏంటీ ఎఫ్​ఏటీఎఫ్​...?

జీ-7 దేశాల చొరవతో 1989లో పారిస్​ వేదికగా స్థాపితమైంది ఎఫ్​ఏటీఎఫ్​. మనీలాండరింగ్ కట్టడి సహా అందులో భాగస్వాములయ్యే దేశాలు, సంస్థలపై తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయడం ఎఫ్​ఏటీఎఫ్​ ప్రధాన విధి. ఇందులో భారత్​ సహా మొత్తం 37 సభ్యదేశాలు ఉన్నాయి. ఆసియా పసిఫిక్​ గ్రూప్​ వంటి 9 ప్రాంతీయ సంస్థలు అనుబంధ సభ్యులుగా ఉన్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఇంటర్​పోల్, ఐడీబీ, ఓఈసీడీ వంటి 23 సంస్థలు 'పరిశీలకులు'గా ఉన్నాయి. ఎఫ్​ఏటీఎఫ్​ చేసే సిఫార్సులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఈ సభ్య దేశాలు, సంస్థల జాబితా చూస్తుంటే అర్థమవుతుంది.

ఎఫ్​ఏటీఎఫ్​ ఏం చేస్తుంది...?

అక్రమ నగదు బదిలీ, ఉగ్ర నిధుల ప్రవాహం కట్టడి కోసం మొత్తం 50 పరామితులు నిర్దేశించింది ఎఫ్​ఏటీఎఫ్​. ఇందులో 40 'టెక్నికల్​ కాంప్లయన్స్​ రేటింగ్​'కు సంబంధించినవి. మిగిలిన 10 మనీలాండరింగ్, ఉగ్రనిధుల ప్రవాహం నియంత్రణకు ఆ దేశం ఎంత సమర్థంగా కృషిచేస్తుందో తెలిపేవి.

50​ పరామితుల ఆధారంగా పాకిస్థాన్​ పనితీరును 2018 అక్టోబర్ వరకు ఆసియా పసిఫిక్ గ్రూప్​(ఏపీజీ) మదింపు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను సెప్టెంబర్​లో ఎఫ్​ఏటీఎఫ్​కు అందించింది. ఈ నివేదిక ఆధారంగా ఇప్పుడు పాక్​ను బ్లాక్​ లిస్ట్​లో చేర్చే అంశంపై నిర్ణయం తీసుకోనుంది ఎఫ్​ఏటీఎఫ్​.

ఎఫ్​ఏటీఎఫ్​ 40 ప్రమాణాలలో పాకిస్థాన్​ కేవలం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నది ఒకదానిలోనే. చర్యలు చేపట్టినవి 9, పాక్షికంగా చర్యలు తీసుకున్నవి 26, అసలు చర్యలు తీసుకోనివి 4 ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రెండో విభాగంలోని 10 ప్రమాణాలలో పాకిస్థాన్​ తొమ్మిదింటిని విస్మరించింది. ఇదే ఇప్పుడు పాక్​ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని కలవరపెడుతోంది. అందుకేవారు ఏపీజీ నివేదికలో తమకు అనుకూలంగా ఉన్న అంశాల గురించే ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు.

కానీ... ఉగ్రవాదం పట్ల పాక్​ మెతక వైఖరిని కళ్లకుగట్టింది ఏపీజీ నివేదిక. ఐరాస భద్రతా మండలి చేసిన 1267వ తీర్మానాన్ని పాక్​ పూర్తిస్థాయిలో అమలు చేయడంలేదని తేల్చిచెప్పింది. ఉదాహరణకు... ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి 2018 ఫిబ్రవరిలో పాకిస్థాన్​ ఓ అత్యవసర ఆదేశం తీసుకొచ్చింది. దాని ప్రకారం కొన్ని ముష్కర ముఠాల నాయకుల్ని అరెస్టు చేసింది. అయితే... ఆ ఆర్డినెన్స్​ గడువు(120 రోజులు) ముగిసేలోగా దానిని చట్టంగా మార్చలేదు. అత్యవసర ఆదేశం కాలపరిమితిని పొడిగించలేదు. ఆ ఉగ్రవాద సంస్థల నేతల్ని 4 నెలల్లోనే విడిచిపెట్టింది. తద్వారా ఉగ్రవాదంపై పోరులో పాక్​ 'చిత్తశుద్ధి' ఏపాటిదో అర్థమవుతుందని ఏపీజీ నివేదికలో పేర్కొంది.

పాక్​​ను బ్లాక్​ లిస్ట్​లో చేర్చితే...?

పాకిస్థాన్​ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఎఫ్​ఏటీఎఫ్​ బ్లాక్​ లిస్ట్​లో చేర్చితే మరిన్ని ఆర్థిక ఆంక్షలు అమల్లోకి వచ్చి... దాయాది పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అలాంటి పరిణామాల్లో కొన్ని...

  1. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, మదుపర్లు పాకిస్థాన్​ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు.
  2. విదేశీ కరెన్సీ లావాదేవీలు, ఇతర దేశాల నుంచి పాక్​కు వచ్చే ఆదాయం​ భారీగా పడిపోతుంది.
  3. స్టాక్​ మార్కెట్​ కుప్పకూలుతుంది.
  4. విదేశీ నిల్వలు వేగంగా తరిగిపోతాయి.
  5. దేశీయ కరెన్సీ విలువ తగ్గిపోతుంది.
  6. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ప్రజాగ్రహానికి దారితీస్తుంది.
  7. పాకిస్థాన్​తో వాణిజ్యం సాగించే దేశాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఈ దేశానికి రుణాలు పొందే అవకాశాలు లేకుండా పోతాయి.
  8. ఇతర దేశాల నుంచి రుణాలు, ఆర్థిక సహాయాలు వంటివి అగిపోయే ప్రమాదం ఉంది.
  9. వాణిజ్యం ఒక్కసారిగా పడిపోతుంది.

చిరకాల మిత్రుడి అండతో..

ఇప్పటికే ద్రవ్యోల్బణం 11 శాతంపైగా పెరిగి పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. విదేశీ మారక నిల్వలు 17 బిలియన్​ డాలర్లకు క్షీణించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనడానికి నిదర్శనం. ఈ విపత్తు నుంచి బయట పడేందుకు చిరకాల మిత్ర దేశమైన చైనా సాయం పొందొచ్చు పాక్​. ఇప్పటికే పాక్​లో భారీగా పెట్టుబడులు పెట్టిన చైనా... ఎలాంటి లాభం లేకుండా ఆ సొమ్మును పోగొట్టుకోవడానికి ఇష్టపడదు. ఎఫ్​ఏటీఎఫ్​ అధ్యక్షుడిగా చైనాకు చెందిన దిగ్గజ బ్యాంకర్​ షియాంగ్​ మింగ్​ ల్యూ ఎన్నికవడం పాక్​కు మరో సానుకూలాశం. ఆయన వచ్చే ఏడాది అక్టోబర్​ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.

అయితే... ఎఫ్​ఏటీఎఫ్​ విషయంలో పాకిస్థాన్​కు సాయం చేసేంత ధైర్యం ఈసారి చైనా చేయకపోవచ్చు. సింగ్యాంగ్​ రాష్ట్రంలో ఉగ్రవాద సమస్య, మసూద్​ అజార్​ విషయంలో డ్రాగన్​ వైఖరిని గమనిస్తే ఇలానే అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య పాక్​ను మరికొంత కాలం బ్లాక్​ లిస్ట్​లో చేర్చకపోయినా... గ్రే లిస్ట్​లోనే కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

(రచయిత-జేకే త్రిపాఠి, మాజీ దౌత్యవేత్త)

ABOUT THE AUTHOR

...view details