ఫేషియల్ రికగ్నిషన్ ఏటీఎంలు ఇప్పటి వరకు ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలంటే పిన్ నంబరు తప్పనిసరి. కానీ ఇక నుంచి పిన్ అవసరం లేదంటోంది స్పెయిన్‌కు చెందిన కైక్సా బ్యాంకు. ప్రపంచంలో తొలిసారిగా ఏటీఎంల్లో ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగంలోకి తెచ్చింది ఈ బ్యాంకు. పిన్ అవసరం లేకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని అతి త్వరలో ఖాతాదారులకు అందుబాటులోకి తేనుంది. ఈ ఏడాది పూర్తయ్యే సరికి స్పెయిన్‌లోని మొత్తం 4,409 ఏటీఎంల ద్వారా ఈ సదుపాయం కల్పించేందుకు యత్నిస్తున్నారు కైక్సా బ్యాంకు అధికారులు.
రెండింటిలో ఏదైనా..
స్పెయిన్ వ్యాప్తంగా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో పాటు పాత పిన్ పద్ధతికి అనుకూలంగా ఉండేలా ఏటీఎంలను సిద్ధం చేస్తున్నారు కైక్సా బ్యాంకు అధికారులు. తద్వారా వినియోగదారులు వారికి నచ్చిన పద్ధతిలో డబ్బును తీసుకోవచ్చు. ఇందుకోసం ఖాతాదారులందరూ ముందుగానే వారి ముఖ కవళికలను బ్యాంకులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అత్యాధునిక కెమెరాలను ఈ ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతలో వినియోగించారు.
70 శాతం మంది సాంకేతికతకే మొగ్గు
నూతన సాంకేతికతో వస్తోన్న ఏటీఎంలపై ఖాతాదారుల అభిప్రాయం తెలుసుకుంది కైక్సా బ్యాంకు. భద్రత, వేగం, సౌలభ్యం తదితర అంశాలపై జరిపిన సర్వేలో 70 శాతం మంది పిన్‌కు బదులుగా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతకే మొగ్గు చూపారని అధికారులు తెలిపారు.
వీరి సహకారంతోనే అభివృద్ధి
ఏటీఎంలను తయారుచేసే ఫుజిత్సూ, ఫేస్ఫై సంస్థల సహకారంతో ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను అభివృద్ధి చేసింది కైక్సా బ్యాంకు.
ప్రపంచంలో తొలిసారి 2012లో కాంటాక్ట్‌లెస్ ఏటీఎంలను వినియోగంలోకి తెచ్చిన బ్యాంకు కూడా కైక్సానే. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్‌ను వినియోగించిన మొదటి బ్యాంకుగా రికార్డు సాధించింది. కైక్సా బ్యాంకుకు స్పెయిన్‌లో మొత్తం 13.7 మిలియన్ల మంది ఖాతాదారులున్నారు. స్పెయిన్‌లో మూడో అతిపెద్ద బ్యాంకు కైక్సా.
" ఇది ఎంతో సానుకూల విషయమని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను మొబైల్ ఫోన్లో వినియోగించే సాంకేతికతకు నన్ను మరింత దగ్గర చేసింది. నేను ఇక నుంచి పిన్ వినియోగించాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్‌ను ఉపయోగించొచ్చు. ఇది ఎంతో ఆధునికమైందని అనుకుంటున్నాను. అలాగే పటిష్ఠ భద్రతతో కూడుకున్నది."
- మార్సిడస్ కాసెరెస్, కైక్సా ఖాతాదారుడు