కరోనా వైరస్ మహమ్మారి పుట్టుక గురించి అంతర్జాతీయ సమాజానికి మరికొద్ది సంవత్సరాల్లోనే వాస్తవాలు తెలుస్తాయని వుహాన్లో పర్యటించిన డబ్ల్యూహెచ్ఓ బృందం సభ్యుడు పీటర్ డస్జాక్ వెల్లడించారు. జంతువుల నుంచి తొలిసారి మనుషులకు కరోనా సోకిన విషయాన్ని సంయుక్త పరిశోధనల ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. వుహాన్లో కరోనా వైరస్ వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం వణ్యప్రాణుల వర్తకమే(మార్కెట్లో జంతువుల అమ్మకం) అయి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓతో పాటు చైనా సైతం ఇదే విషయాన్ని బలంగా నమ్ముతోందని అన్నారు.
"వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే దీన్ని కనుగొంటామని మాకు నమ్మకం ఉంది. కరోనావైరస్ పుట్టుకపై వాస్తవ సమాచారం తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉద్భవించిందనే వివరాలన్నీ తెలుస్తాయి."
-పీటర్ డస్జాక్, డబ్ల్యూహెచ్ఓ బృందం సభ్యుడు.