కరోనా వైరస్‌తో సహజీవనం చేయక తప్పదని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంగీకరించాయి. అందువల్ల లాక్డౌన్ ఆంక్షలను సడలించి ప్రజలను బయటకు అనుమతిస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కొన్నేళ్ల సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో.. లాక్డౌన్ సడలింపు వల్ల ఉన్న లాభనష్టాలపై వివిధ దేశాల నేతల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఎదురుచూడలేమని.. ప్రజలు కరోనాతో జీవించడానికి అలవాటు పడాలని ఐరోపా నేతలు తేల్చిచెబుతున్నారు.
"లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తే కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉంది. ఈ విషయం మాకు తెలుసు. కానీ వ్యాక్సిన్ కోసం ఇటలీ ఎదురుచూడలేదు. అందుకే అన్నీ ఆలోచించి రిస్క్ తీసుకుంటున్నాం. ఇప్పుడు కాకపోతే అసలెప్పటీకీ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించలేము."
--- గిసెప్పీ కాంటే, ఇటలీ ప్రధాని
వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే కరోనా వైరస్‌కు అసలు వ్యాక్సిన్ కనుగొనలేకపోవచ్చని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు.