Europe Omicron: వచ్చే ఏడాది జనవరి మధ్యనాటికి ఐరోపాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇతర వేరియంట్ల కంటే అత్యంత ప్రధానమైనదిగా మారుతుందని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయన్ బుధవారం తెలిపారు. కేసులు కూడా పెరుగుతాయని అంచనా వేశారు. రానున్న పండగ సీజన్లో ఈ వేరియంట్ విజృంభిస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆమె ఈ మేరకు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి ఐరోపా సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఐరోపా జనాభాలో 66.6శాతం మంది ఇప్పటికే పూర్తి స్థాయి టీకా తీసుకున్నారని చెప్పారు.
Omicron dominant variant: మహమ్మారి కారణంగా క్రిస్మస్ వేడుకలకు భంగం కలిగే అవకాశం ఉందని ఉర్సులా విచారం వ్యక్తం చేశారు. "మీలో చాలా మందిలాగే, ఈ క్రిస్మస్కు మరోసారి మహమ్మారితో ఆటంకం కలుగుతుందని నేను బాధపడుతున్నాను" అని ఆమె చెప్పారు. కొన్నివారాలుగా డెల్టా కేసులు పెరుగదలతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఐరోపా డబుల్ ఛాలెంజ్ సవాలును ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో.. ఐరోపాలోని పలు దేశాలు వైరస్ ఆంక్షలను మరింత కఠినతరం చేశాయి.
ఇదీ చూడండి:'ఒమిక్రాన్‌తో జాగ్రత్త.. మరణాలు పెరుగుతాయి!'
కంబోడియాలో తొలి కేసు..
Cambodia omicron: మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వివిధ దేశాలకు క్రమంగా విస్తరిస్తోంది. కంబోడియాలో 23 ఏళ్ల మహిళకు తొలిసారి ఈ వేరియంట్ సోకినట్లు తేలింది. ఆఫ్రికా దేశమైన ఘనా నుంచి ఇటీవల ఆమె తిరిగి వచ్చిందని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.